బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌:మంత్రి కేటీఆర్ ధ్వజం

  • Publish Date - November 10, 2023 / 02:55 PM IST

విధాత : కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ రూపకల్పన చేసినట్లుగా ఉందని, లోపభూయిష్టమైన ఆ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ఉపసంహరించుకోవాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు.


మైనారిటీల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీల ప్రత్యేక హోదా పోతుందని అన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు.


కాంగ్రెస్‌ పార్టీ వారి ప్రభుత్వాల పదేళ్ల కాలంలో మైనారిటీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యి ఎన్నికలలో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఆచరణ సాధ్యంకాని హామీలు, డిక్లరేషన్లతో మోసపూరిత ప్రచారం సాగిస్తుందన్నారు.