గులాబీ వనంలో భద్రాచలం చేరాలి: మంత్రి కేటీఆర్
భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పటిదాకా మా పార్టీ అభ్యర్ధి గెలవలేదని, ఈసారి ఖచ్చితంగా గులాబీ వనంలోకి భద్రాచలం చేరాలని, కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే యాదాద్రి కంటే గొప్పగా రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు

- గెలిపిస్తే యాదాద్రికి మిన్నగా భద్రాచలం అభివృద్ధి చేస్తాం
- రోడ్ షోలో మంత్రి కేటీఆర్
విధాత : భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పటిదాకా మా పార్టీ అభ్యర్ధి గెలవలేదని, ఈసారి ఖచ్చితంగా గులాబీ వనంలోకి భద్రాచలం చేరాలని, కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే యాదాద్రి కంటే గొప్పగా రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెంలలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
భద్రాచలం వచ్చినప్పుడు రాముడి పాదాలకు నమస్కరించాలనుకున్నానని, అయితే అధికారుల విజ్ఞప్తి మేరకు వెళ్లలేదని చెప్పారు. తొందర్లోనే మళ్లీ వచ్చి రామయ్య దర్శనం చేసుకుంటానన్నారు. కారణాలు ఏమైనప్పటికీ భద్రాచలంలో ప్రజలు మాకు గత రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వలేదన్నారు. దానివల్ల కొంత గ్యాప్ వచ్చిందని, ఈసారి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించాలని, వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతుందని, ఇప్పటివరకు 11 చాన్స్‌లు ఇచ్చినా చేసిందేమి లేదన్నారు.
ఎన్నికల్లో 11 సార్లు గెలిచిన కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆరెస్ అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే 24 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. కొంతమంది డబ్బు సంచులతో వస్తున్నారని, అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దు అని కేటీఆర్ కోరారు. చిన్న చిన్న అసంతృప్తులను ప్రజలు పక్కన పెట్టి బీఆరెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణలో మరోసారి రాబోయేది బీఆరెస్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని భద్రాచలం, ఇల్లెందు సహా ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.