Surekha vs Nayini | వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. మంత్రి కొండా సురేఖ మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య భగ్గుమంటున్న విబేధాలు
నీ లాగా పూటకో పార్టీ మారితే నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడిని అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి https://t.co/Mitz8I59Pn pic.twitter.com/dcfOZ1azjG
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2025
మంత్రి కొండా సురేఖ తనను అదృష్టం కొద్దీ గెలిచాడని చేసిన వ్యాఖ్యలపై నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. సమాధానంగా ఆయన ఎక్స్‌లో ఒక వీడియో విడుదల చేసారు. దాన్లో, “కొండా సురేఖలా పార్టీలు మారుకుంటూ పోయే ఆలోచనే ఉంటే నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడిని” అని ఘాటుగా ఎద్దేవా చేశారు.
భద్రకాళి ఆలయ పాలకమండలి నియామకాల విషయంలో తనను సంప్రదించకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రానా ఎవరినైనా అనుమతి లేకుండా నియమించవచ్చా? స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడనే విషయమే పక్కన పెట్టేస్తారా? నా నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం అంగీకరించలేను” అని నాయిని వ్యాఖ్యానించారు.
అలాగే తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని కూడా హెచ్చరించారు. కొండా సురేఖ ఇదే పద్ధతిని కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు రెండు రోజుల క్రితం అధికారికంగా ఫిర్యాదు చేశారు.
అంతకుముందు, నాయిని రాజేందర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ కూడా ఘాటుగానే స్పందించారు. ఆమె పేర్కొంటూ, “నాయిని అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై నాకు ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తనకన్నా ముందు ఎమ్మెల్యేగా కావాలనుకున్న వారు ఇప్పుడు అయ్యారని చెప్పుకోవడం ఆయన స్వభావానికి ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.
భద్రకాళి ఆలయ పాలకమండలి నియామకాల గురించి మాట్లాడుతూ, “నేను వ్యక్తిగత ఇష్టప్రకారం నియామకాలు చేయలేదు. అధిష్ఠానం పంపిన పేర్ల ఆధారంగా భర్తీ జరిగింది. ఆ శాఖ మంత్రి హోదాలో ధర్మకర్తల నియామకం చేయడం నా బాధ్యత” అని స్పష్టం చేశారు. నాయిని చేసిన విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదని, ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని సురేఖ వ్యాఖ్యానించారు. వీటికి కౌంటర్‌గానే నాయిని రాజేందర్ రెడ్డి ఆ వీడియో రిలీజ్ చేశారు.
కొండా సురేఖ–నాయిని రాజేందర్ రెడ్డి మధ్య ఈ ఘర్షణల వల్ల వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే స్థానిక నాయకత్వం మధ్య విభేదాలు బహిర్గతం అవుతుండగా, ఇరువురి ఘాటైన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో ఇలాంటి గొడవలు కొనసాగితే, రాబోయే ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలకే పరిమితం కాలేదు. భద్రకాళి ఆలయ పాలకమండలి నియామకాలు ఈ వివాదానికి మరోసారి తెర తీసినా, ఇరువురి మధ్య ఉన్న పాత విబేధాలు మళ్లీ బయటపడ్డాయి. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ నేతలందరూ కొండా దంపతులపై గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌కు వారు ఫిర్యాదు చేయడం, క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి రావడంలాంటివి జరిగినా, ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేకపోవడం కూడా మిగతా నేతలకు మింగుడుపడటంలేదు. ఈ ఘర్షణకు ఇప్పట్లో ముగింపు కూడా కనబడటం లేదు. ఇవన్నీ కాంగ్రెస్ జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.