Vijay | కోలీవుడ్‌లో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టి మరింత బిజీగా మారిన సంగతి తెలిసిందే. ‘దళపతి’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ అనే రాజకీయ పార్టీని స్థాపించి రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం వెలువడింది. తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌తో తన వైవాహిక జీవితం కొనసాగించడం సాధ్యం కాదని, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా, విజయ్‌కు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధం ఉందని కూడా ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి.
విడాకుల వ్యవహారంలో భాగంగా తన జీవనోపాధి, పిల్లల భవిష్యత్తు కోసం భరణం కోరినట్లు సమాచారం. సినీ వర్గాల అంచనా ప్రకారం విజయ్ ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఒకవేళ కోర్టు తీర్పు సంగీతకు అనుకూలంగా వస్తే ఆస్తిలో సగం ఇవ్వాల్సి వస్తుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.అయితే భారతీయ చట్టాల ప్రకారం విడాకుల సందర్భంలో భర్త ఆస్తిలో 50 శాతం ఇవ్వడం తప్పనిసరి అనే నిబంధన లేదు. ప్రతి కేసును కోర్టు ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. భార్యాభర్తల ఆదాయం, ఆర్థిక స్థితి, పిల్లల అవసరాలు, కుటుంబ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భరణం మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
ఇదిలా ఉండగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పెద్ద రాద్ధాంతం చేయకుండా ముగించేందుకు విజయ్ సుమారు రూ.250 కోట్ల వరకు భరణంగా ఆఫర్ చేసినట్లు కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు విజయ్ గానీ, సంగీత గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మెరిసిన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. అధికారిక స్పష్టత వచ్చే వరకు ఈ వార్తలపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
