విధాత, హైదరాబాద్ : ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత వారిగా వేగంగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్కలతో కలిసి సచివాలయంలో ములుగు జిల్లా పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ములుగుజిల్లాలో సాగునీటి పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, భూ సేకరణ సమస్యలు తదితర అంశాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.
ములుగు నియోజకవర్గ పరిధిలో 1,10,632 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు వివరించారు. దేవాదుల, ఎస్సార్ఎస్పీ స్టేజ్–I, రామప్ప పాకాల లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు, పోట్లాపూర్ ఎత్తిపోతల, పాలేం వాగు ప్రాజెక్టు, మోడి కుంట వాగు, ఫ్లడ్ బ్యాంకులు తదితర పనుల స్థితిగతులపై మంత్రులు సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి 15 రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భూ సేకరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని, అన్ని ప్రక్రియలు పూర్తైతే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
భూములు కోల్పోయే రైతులకు అమోదయోగ్యమైన మంచి ప్యాకేజీ అందించి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఉత్తమ్, పొంగులేటిలు తెలిపారు. స్వయంగా మంత్రులే రైతుల వద్దకు వెళ్లి భూ సేకరణ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. రామప్ప – లక్నవరం ఇంటర్ లింకింగ్ పనులకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ములుగు రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని ఆదేశించారు. సమావేశానికి ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర్ తో పాటు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ములుగు జిల్లా ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
AP Legislative Council : చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!
