మంత్రి కేటీఆర్ పర్యటనా? మజాకా? ముఖ్యమంత్రి మించి ఆంక్షలు

  • వరంగల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
  • ముఖ్యమంత్రి కంటే మించిన చర్యలు
  • హాట్ టాపిక్ గా పోలీసుల తీరు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన రాష్ట్రానికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. అంతమాత్రాన అసాధారణ చర్యలు తీసుకోవడం ఏమిటని వరంగల్ నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా ఇలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని, ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో, పండుగల సందర్భంగా చేపట్టే ట్రాఫిక్ ఆంక్షలు.. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా తీసుకోవడం ఆశ్చర్యానికి లోను చేస్తున్నది. పోలీసుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


అధికార పార్టీ నేత ఆశీస్సుల కోసం ఈ చర్యలు చేపట్టారనే చర్చ సాగుతోంది. మంత్రి కేటీఆర్ పర్యటనా? మజాకా? అనే రీతిలో శుక్రవారం వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పైగా ప్రజల కోసమే ఇదంతా పాటిస్తున్నట్లు చెప్పుకోవడం కొసమెరుపు. ఒక్క మంత్రి రాక సందర్భంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే జిల్లాలో నిత్యం ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, చీఫ్ విప్ లు వినయ్ భాస్కర్, పల్లా తదితరులు నిత్యం పర్యటిస్తున్నారు. మరి వారి రాకపోకల సందర్భంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు అవస్థలు తప్పవేమో అంటున్నారు.

భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు


శుక్రవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వీ రంగనాథ్ తెలిపారు.

– ములుగు, భూపాలపల్లి వైపు నుండి హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్ళాలి. భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్ళవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్ళాలి.

– భూపాలపల్లి, పరకాల నుండి నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట వెళ్ళాలి.

– సిటి లోపలికి వచ్చు భారీ వాహనాలు సిటీ అవతల ఆపుకోవాలి. మంత్రి పర్యటనలో ఎలాంటి వాహనాలు సిటీ లోపలికి అనుమతించరు.

వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు


ములుగు, పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కేయూసీ, సీపీఓ అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్ కు చేరుకోవాల్సిఉంటుంది.

హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీఓ ద్వారా కేయూసీ, జంక్షన్ మీదుగా వెళ్ళాలి.

హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్ళాలి.

వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.