– జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టిపెట్టాలి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– సమాచార శాఖ పనితీరుపై సమీక్ష
విధాత: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని, ఆదిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియా వింగ్ ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చిదిద్దాలన్నారు. ఈపత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తేవాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్రస్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాచార శాఖ పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు. సమాచార శాఖతోపాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమిషనర్ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, హాష్మి, రాజారెడ్డి, సురేష్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధా కిషన్, ప్రాంతీయ సమాచార ఇంజనీర్ జయరామ్ మూర్తి, రాములు, అకౌంట్స్ ఆఫీసర్ పద్మ కుమారి పాల్గొన్నారు.