Site icon vidhaatha

అర్హులైన అందరికి ఇండ్లు కట్టిస్తాం: మంత్రి పొంగులేటి

విధాత, హైదరాబాద్ : గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నా పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన గోల్‌తండా గ్రామసభలో మాట్లాడారు. మొదటి విడతలో అతి పేదలకు ఇండ్లు మంజూరీ చేస్తానని, తదుపరి స్థలం ఉన్న వారందరికి ఇండ్లు మంజూరీ చేయిస్తానని తెలిపారు. వచ్చే ఏడాదిలో స్థలాలు లేని వారికి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. మూడో సంవత్సరం నాటికి అర్హులైన వారందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనన్నారు. అలాగే వచ్చే ఏడాదిలోగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు వసతి కల్పించే బాధ్యతనాదేనన్నారు.

ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు. గ్రామసభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత బీఆరెస్ ప్రభుత్వం కమిషన్లు వచ్చే స్కీమ్‌లు తప్ప పేదలకు, ప్రజలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం అమలు చేయలేదన్నారు. స్కీమ్‌లన్నింటిని స్కామ్‌లుగా మార్చేశారని విమర్శించారు. సాగుతాగునీటి ప్రాజెక్టుల్లోనూ కమిషన్లు దండుకున్నారన్నారు. పేదలకు ఒక్క రేషన్ కార్డు, ఇండ్లు కట్టించని దుర్మార్గ పాలన గత పదేళ్లలో సాగిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు.

Exit mobile version