Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం, విడుదలైనప్పటి నుంచి రికార్డు స్థాయి వసూళ్లతో దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, వీకెండ్ పూర్తయ్యేలోపు రూ.300 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఈ సూపర్ సక్సెస్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నట్టైంది.
సోషల్ మీడియాలో సినిమా విడుదలకు ముందు నెగటివ్ ప్రచారం జరిగినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. మరోసారి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు అనిల్. టాలీవుడ్‌లో అపజయమే ఎరుగని దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి పేరు ముందుండటం విశేషం. ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు తెరకెక్కించగా, తొమ్మిదింటికీ ఘన విజయాలు దక్కాయి. భారీ పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో కూడా, రీజనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతోనే భారీ వసూళ్లు రాబడటం అనిల్ ప్రత్యేకతగా మారింది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ డైరెక్టర్లలో ఒకరిగా ఆయన పేరు వినిపిస్తోంది.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఇప్పుడు ఫోకస్ మొత్తం అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పడింది. స్టార్ హీరోల డేట్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయకుండా, అందుబాటులో ఉన్న హీరోలతో సినిమాలు సెట్ చేసుకోవడమే అనిల్ స్ట్రాటజీ. అందుకే సినిమా విడుదలైన వెంటనే మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం ఆయనకు అలవాటే. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, విక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి మరోసారి చేతులు కలపబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK 47’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ‘దృశ్యం 3’ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకీ తదుపరి సినిమా అనిల్ రావిపూడితోనే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
