- రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు
- ఏఐ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్లు ఇచ్చేలా యోచన
- త్వరలో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లు
- వాహన సారథి లోకి తెలంగాణ ఎంట్రీ
- రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
నల్గొండ : తెలంగాణ రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఏఐ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. త్వరలో ఢిల్లీ తరహాలో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లు తీసుకొస్తామని ప్రకటించారు. శనివారం నల్గొండ జిల్లా దండంపల్లి గ్రామంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, వాహన ఫిట్నెస్ లేకపోవడం , రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మానవ ప్రమేయం ఉంటే అవినీతికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 17 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామని, నల్లగొండ లో రెండో ఏటీఎస్ కు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఒక్కో స్టేషన్ కు 8 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని, 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కి వెళ్తున్నాయని పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం వాహన సారథి లోకి ఎంట్రీ అయినట్లు.. వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ తదితర వాటిని వాహాన సారథిలో చూసుకోవచ్చన్నారు. ట్రాఫిక్ చిల్డ్రన్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పలు స్కూల్ లో ప్రారంభించామని తెలిపారు. దీని వల్ల పిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించవచ్చని తెలిపారు. ఎవరు చెప్పిన లైసెన్స్ పొందడానికి లేదని, అర్హత ఉంటేనే వస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్లో ఎలక్ట్రిక్ బస్సులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. జిల్లా కు 77 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కాగా రిజిస్ట్రేషన్ పూర్తయిన 40 బస్సులకు జెండా ఊపి ప్రారంచారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బస్సు నడిపి ఆశ్చర్యపరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, తదితరులు పాల్గొన్నారు.
రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు ఏఐ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్లు ఇచ్చేలా యోచన : రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
