హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): యూరియా సరఫరా అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది.. కేంద్రం యూరియా తగినంత సరఫరా చేయాలని కేంద్రమంత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రైతులు ఆందోళన చెందవద్దని యూరియా సమస్య తీరుతుందని భరోసా ఇచ్చారు. గురువారం ఆయన హుస్నాబాద్ నియోజకవర్గం వెంకేపల్లి, సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎక్లాస్ పూర్‌లో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామాల్లో రోడ్లు, నాళాలు, అంగన్వాడీ భవనాలు , గ్రామ పంచాయతీ భవనాలు ఇలా అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మహిళా సంఘాలకు మా నాన్న పేరు మీద స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామని, ప్రతి హోటల్‌లో స్టీల్ సామాగ్రి ఉండేలా పంపిణీ చేశామన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం,రేషన్ కార్డులు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే,లక్ష్మీ కిరణ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.