విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: భారత రాష్ట్రపతి, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆమె వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటూ ఆమె పర్యటన ఆసాంతం కొనసాగడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర స్త్రీ సంక్షేమ గిరిజన శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
గిరిజనబిడ్డగా రాష్ట్ర ప్రతినిధిగా దేశ ప్రథమపౌరురాలికి స్వాగతం పలికే అవకాశం రావడం, వారితో కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం సంతోషానిచ్చిందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ప్రజలదీ వెనలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ద్రౌపదిముర్ము తీరిక లేకుండా గడిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల సందర్శనలు, ప్రారంభోత్సవాలతో పాటు వరుస సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రామప్పలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము మంత్రి సత్యవతిని అభినందించారు.
స్వాగతం నుంచి సందర్శన వరకూ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులతో పాటు స్వాగతం పలికిన కార్యక్రమంలో మొదట రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భాగస్వామ్యం అయ్యారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి చేపట్టిన పర్యటనలు, సందర్శనలు, ప్రారంభ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాలుపంచుకున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు, గట్టి బందోబస్తు కార్యక్రమాలు జరిగే విధంగా ఎప్పటికప్పుడు మంత్రి సత్యవతి పర్యవేక్షించారు.
గిరిజన ప్రాంతంలో గిరిజన బిడ్డలు
రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా సందర్శించిన గిరిజన ప్రాంతాలైన భద్రాద్రి, రామప్ప దేవాలయాలను సందర్శించడం ప్రత్యేకత. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఈ రెండు జిల్లాల్లో మంత్రి సత్యవతి, ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు మెజారిటీ ప్రజా ప్రతినిధులు గిరిజనులు కావడం విశేషం.
గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ముకు గిరిజన ప్రజాప్రతినిధులు స్వాగతం పలకడం, ఈ అధికారిక కార్యక్రమానికి గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించడం కొసమెరుపు.
పర్యటనలో భాగంగా..
రాష్ట్రపతి పర్యటనలో భాగంగా హైదరాబాదులో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారులతో జరిగిన సమావేశంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఉత్సవాలకు హాజరయ్యారు. తదుపరి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటించారు.
ముందుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ద్రౌపది ముర్ము దర్శనం అనంతరం ప్రసాద స్కీమ్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్ పాఠశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం ములుగు జిల్లాలోని అత్యద్భుత శిల్పసంపదతో యునెస్కో గుర్తింపుతో విశ్వవ్యాప్తమైన ఖ్యాతిని పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. సంప్రదాయ గిరిజన నృత్యాలతో కళాకారులు ముర్ముకు స్వాగతం పలికారు.