విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతరకు జాతీయ హోదా ఇస్తామంటున్నారు.. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందా అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ , ప్రభుత్వం చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతూ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ములుగు, భూపాలపల్లికి వచ్చి గిరిజన ప్రాంతమైన ములుగుకు గొప్ప హామీలు ఇస్తారని ఎదురుచూశాం.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వారి మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే.. కొంతమంది నాయకుల డైరెక్షన్లో మాట్లాడినట్టుంది.. వాళ్లకు ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ లేదు. పోడు చట్టాన్ని మేమే తెచ్చాం అంటున్నారు.. కాంగ్రెస్ హయాంలో గిరిజనులు, గిరిజనేతరులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ములుగు లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందన్నారు. సీఎం కేసీఆర్ 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలు అందించారు.. అందులో ఎమ్మెల్యే సీతక్క కుటుంబం కూడా ఉందన్నారు. ఢిల్లీ పార్టీలు మన గల్లీ ప్రజలకు అవసరమా? సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా మూడోసారి హ్యాట్రిక్ కొడతామంటూ ధీమా వ్యక్తం చేశారు.