విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పేదల కష్టాలు ప్రజాప్రతినిధులకు ఎన్నికల ముందే కనిపిస్తాయంటారు. ఓట్ల కోసం గడప గడపకూ దేవులాడుతూ వెళ్తున్న నాయకుల ప్రచార సిత్రాలు విస్తుగొల్పుతాయి. ఇలాంటిదే గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని పాలకొండ గ్రామంలో గురువారం మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయమే ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులను వెంటబెట్టుకొని కాలనీలోని తిరుపతమ్మ ఇంటి గడప తొక్కారు.
ఆమె కట్టెల పొయ్యిపై వంట చేస్తూ మంత్రి కంట పడింది. వేడివేడిగా జొన్న రొట్టె పొగచుట్టూ కాలుతోంది. అంతలోనే మంత్రి ఆమెతో మాటామంతి అందుకున్నారు. ‘అయ్యో తిరుపతమ్మా… గ్యాస్ ధర ఎక్కువైందని కట్టెల పొయ్యి మీద చేస్తున్నావా? మోడీ పెంచిన గ్యాస్ ధర భారాన్ని మేం (బీఆరెస్ ప్రభుత్వం) భరిస్తాం. మీకు జనవరి నుంచి రూ.400 కే గ్యాస్ బండ ఇంటికి చేరుస్తాం. ఇక త్వరలోనే నీకు కట్టెల పొయ్యి పొగ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది’ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. మంత్రి వంకే చూస్తుండిపోయిన తిరుపతమ్మా… ఉదయమే ఇంటికి వచ్చిన పెద్ద సారుకు వేడివేడి రొట్టెలు వడ్డించింది. అవి తింటూ మంత్రి మళ్లీ ఆమెతో మాటలు కలిపారు.
ఇక తిరుపతమ్మ వంతు.. ‘తాము తెలంగాణ ప్రభుత్వం ద్వారా అనేక పథకాలను లబ్ధి పొందాం. ఒక్క తమ ఇంటికే రైతుబంధు, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వస్తున్నది. 24 గంటల ఉచిత కరెంటు వల్ల సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేనా అంటే… 2014కు ముందు ట్యాంకర్ తో నీళ్ళు వచ్చేవని, తాగునీళ్ల కోసం గొడవపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆనాటి కష్టాలన్నీ సమసిపోయాయి… ఇంటికే నేరుగా నల్లా ద్వారా మంచినీళ్లు వస్తున్నయి అంటూ మంత్రితో పాటు జనం చెవిలో వేసింది. సంబరపడ్డ మంత్రి రానున్న రోజుల్లో ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి, అక్కడి నుంచి ప్రచారానికి ముందెకెళ్లారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకుల పాట్లకు ఈ సిత్రం అద్దంపట్టింది.