కాంగ్రెస్‌ వస్తే కటిక చీకటే: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ సమయానుకూలంగా లేక, కటిక చీకట్లు అలుముకొన్నాయని... ఆపార్టీని గెలిపించి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కన్నడ ప్రజల

– ఆపార్టీకి ఓటేస్తే కర్ణాటక దుస్థితి తప్పదు

– రైతు బాగుంటే ఓర్వలేక విషం కక్కుతున్నరు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ సమయానుకూలంగా లేక, కటిక చీకట్లు అలుముకొన్నాయని… ఆపార్టీని గెలిపించి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కన్నడ ప్రజలు మొత్తుకుంటున్నారని మహబూబ్ నగర్ బీఆరెస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ మండలం పోతినపల్లి, మాచన్ పల్లి, రాంచంద్రపూర్ గ్రామాల్లో నిర్వహించిన పార్టీ ప్రచార సభల్లో మంత్రి మాట్లాడారు.


కర్ణాటకలో రైతులకు పట్టుమని ఐదు గంటల కరెంట్‌ ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని, పొరపాటున ఇక్కడ ఆపార్టీకి ఓటు వేస్తే కర్ణాటక పరిస్థితి మనకు దాపురిస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్లలో మొసళ్లను తెచ్చి వదిలి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాంటి కష్టాలు మనకు రాకుండా చేసిన సీఎం కేసీఆర్ కు మరోసారి అండగా నిలబడాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గతంలో కరెంటు బిల్లులు కట్టలేదని మోటార్లు లాక్కుపోయేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితే లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.


రైతు, బీసీ, దళితబంధు, ఉచితంగా గొర్రెలను పంపిణీ చేస్తుంటే, చూసి ఓర్వలేక ఆపేయాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెసోళ్లు ఫిర్యాదు చేశారన్నారు. పేదలకు అందిస్తున్న పథకాలను కేవలం ఈనెల రోజులు మాత్రం ఆపగలరని, ఎన్నికల అనంతరం ఎవరూ ఆపలేరని మంత్రి పేర్కొన్నారు. లక్ష రూపాయలు కూడా విలువ చేయని భూములు.. ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు.


పాలమూరు ప్రాజెక్టులో భాగంగా కరివెన, ఉదండాపుర్ రిజర్వాయర్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే కాలువలు తవ్వి సాగునీటిని అందిస్తామన్నారు. మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, శాంతయ్య యాదవ్, మల్లు నరసింహారెడ్డి, సుధాశ్రీ, వెంకటేశ్వరమ్మ, ఆంజనేయులు, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, దేవేందర్ రెడ్డి, రవిందర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.