పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌కు సున్నా సీట్లే: మంత్రి ఉత్తమ్‌

  • Publish Date - April 3, 2024 / 08:01 PM IST

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ పోటీలోనే లేదని… వాళ్లకు సున్నా సీట్లేనని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఆరెస్‌ పార్టీ మిగలదన్నారు. 13 -14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆరెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో ఉందని గ్రహించే బీఆరెస్ పెద్దలు కాంగ్రెస్‌పై కరవు పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు ఉండవన్నారు. కరువు బీఆరెస్‌ హయాంలోనే మొదలైందన్నారు. జలాశయాల్లో నీళ్లు లేవని 2 జూలై 2023లోనే గుర్తించారని.. పదేళ్ళలో మీరు చేయనివి తాము 100 రోజులో చేశామన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినందుకు కేసీఆర్, కేటీఆర్‌లు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కోన్న అధికారులు బీఆరెస్ పెద్దలు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా చెప్పారన్నారు. ఇంకా సిగ్గులేక ఎదురుదాడి చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రతిపక్ష రాజకీయ నేతల పోన్ల ట్యాపింగ్‌లతో పాటు నగల వ్యాపారులు, రియల్టర్లను, సెలబ్రీటీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడటం, ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల డబ్బులను పట్టుకునిపోవడం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ను అధికారులతో చేయించిన సూత్రదారులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులేనని విచారణలో వెల్లడవుతుందన్నారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ ఆధిపత్యం చెలాయించేందుకు వారు చేసిన ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకంగా సాగిందని, చట్టం తనపనితాను చేసుకుపోతుందని విచారణ మేరకు చర్యలుంటాయన్నారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్యం అనంతరం ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలను జైలుకు పంపుతున్నారని, ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచార ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు.

Latest News