Raja Saab | ‘పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. మారుతి దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షోలు పూర్తయ్యాక సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తున్నప్పటికీ, థియేటర్లలో ప్రభాస్ అభిమానుల హడావిడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
మాళవిక మోహనన్, రిద్ధీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా ప్రచారం పొందిన ఈ చిత్రంలో, జరీనా వాహెబ్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏంటంటే హీరోయిన్ల సంఖ్య. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రమోషన్ల వరకు ‘ది రాజాసాబ్’లో ముగ్గురు హీరోయిన్లే ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగింది. పోస్టర్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా చర్చలన్నీ నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్, మాళవిక మోహనన్ చుట్టూనే తిరిగాయి. కానీ థియేటర్‌లో సినిమా చూస్తే మాత్రం మరో పెద్ద సర్ప్రైజ్ ఎదురవుతోంది. ఇందులో ముగ్గురు కాదు, ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆ మిగతా ఐదుగురు ఎవరు అంటే జరీనా వాహెబ్ ఒకరు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు నానమ్మ పాత్రలో కనిపించిన ఆమె, ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించారు. ఇక ఆమెతో పాటు తమిళ నటి అమ్ము అభిరామి, ఆనంది, ఇనయా సుల్తానా, మనీషా కందుకూర్ కూడా సినిమాలో కీలకంగా కనిపించారు. వీరు కథలో స్నేహితులుగా కనిపించినప్పటికీ, తమ తమ కెరీర్లలో లీడ్ హీరోయిన్లుగా నటించిన అనుభవం ఉన్నవారే.
సినిమా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. “మారుతి స్క్రీన్‌ప్లేలో ఇదో స్టైలిష్ ప్లానింగ్”, “ఎనిమిది మంది హీరోయిన్లతో కూడా కథను బ్యాలెన్స్ చేయడం ఈ సినిమాకే ప్రత్యేకత” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా చూసినవాళ్లకు ఇది తెలిసిపోయినా, ఇంకా చూడని ప్రేక్షకులు మాత్రం థియేటర్‌లో ఈ సర్ప్రైజ్‌ను గమనిస్తే మరింత ఆసక్తికరంగా అనిపిస్తుందని చెప్పవచ్చు.
మొత్తానికి, ‘ది రాజాసాబ్’లో హీరోయిన్ల సంఖ్యే మరో హైలైట్‌గా మారింది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు, ఇంతమంది నటీమణులను ఒకే సినిమాలో చూపించిన మారుతి ప్లానింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తోంది.
