మైనారిటీల ఓటు ఎటు!

  • రెండు దఫాలుగా బీఆరెస్‌ వెంటనే ముస్లింలు
  • ఈ ఎన్నికల్లో కూడా అటే నిలబడుతారా?
  • మాతోనే బీఆరెస్‌కు అధికారమన్న మజ్లిస్‌
  • ఎంఐఎం చేసిన వ్యాఖ్య‌ల్లో ఆంతర్యమేంటి?
  • త్వరలో తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు
  • మైనార్టీలపై ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం
  • లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌వైపు మళ్లే చాన్స్‌

విధాత‌, హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం దగ్గ‌ర ప‌డుతుండ‌టంతో రాజ‌కీయ‌ పార్టీలు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు స‌ర్వ‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అనేక హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రజల్లో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నది. మ‌రోవైపు అధికార బీఆరెస్ కూడా అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయడంతో నేరుగా అభ్యర్థులే ప్రచారంలోకి దిగిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఏ విధంగా ప‌ని చేస్తామో చెప్పుకుంటూ ఓట‌ర్ల‌ను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీజేపీ సైతం కేంద్ర నాయ‌కులు, ప్ర‌ధానితో వ‌రుస సభలు, సమావేశాలు నిర్వ‌హిస్తూ ఓట‌ర్ల‌ను ఆకర్షించే పనిలో ఉన్నది. మరోవైపు బీఎస్పీ కూడా బ‌హుజ‌న ఎజెండాతో, బ‌హుజ‌నుల రాజ్య‌స్థాప‌నే లక్ష్యమంటూ అడుగులు వేస్తున్న‌ది.

తన మార్క్‌ చూపే యత్నాల్లో ఎంఐఎం


ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉన్న ఎంఐఎం పార్టీ కూడా త‌న మార్క్ ఉండాల‌ని చూస్తున్నది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ మైనారిటీల ఓట్లు ఏ పార్టీకి ప‌డుతాయ‌న్న సందేహాలు రాజ‌కీయ విశ్లేష‌కుల‌తో పాటు ప్ర‌జ‌ల్లోను ఆస‌క్తి రేపుతున్నాయి. ఓ వైపు బీఆరెస్‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ ఇప్ప‌టికే ప్ర‌కటించారు. తాము పోటీ చేయ‌ని స్థానాల్లో బీఆరెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తామని కూడా వెల్ల‌డించారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో సైతం సీఎం కేసీఆర్ లాంటి నాయ‌కుడు దేశానికి అవ‌స‌రమ‌ని ఎంఐఎం నేత గతంలో వ్యాఖ్యానించారు.


ఇలాంటి నేప‌థ్యంలో ఎంఐఎం మ‌ద్ద‌తు లేకుండా బీఆరెస్‌కు 60 సీట్లు కూడా రావంటూ ఆ పార్టీ నేత‌ అక్బ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో కూడా అనేక స్థానాల్లో ప్రభావవంతమైన సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. వీరి ఓట్లన్నీ జేడీఎస్‌కు ప‌డాల‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ కోరుకున్నారని చెబుతుంటారు. కానీ.. బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్నదని విశ్వసించిన ముస్లింలు ఆ పార్టీకే ఓటేశారు. జేడీఎస్ వైపు ఉన్న ముస్లిం ఓట‌ర్లు సైతం కాంగ్రెస్ వైపు చూడ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది చూడాలి.


ఐదు రాష్ట్రాల్లో గెలిస్తే కాంగ్రెస్‌కే మైనారిటీ ఓటు


దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ స‌మీక‌రణాలను పరిశీలిస్తే.. మైనారిటీలు కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ వ‌రుస‌గా రెండుసార్లు ఓట‌మి పాల‌వ‌డంతో ఇక్క‌డి మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు బీఆరెస్‌కు ఆకర్షితులయ్యారనే వాదన ఉన్నది. సీఎం కేసీఆర్ మైనారిటీలకు ఇచ్చిన ప్రాధాన్యం కానీ, ఎంఐఎంతో బీఆరెస్‌కు ఉన్న సంబంధాలు కానీ ఇందుకు దోహదం చేసి ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. దీంతోపాటు షాదీ ముబార‌క్, మైనార్టీ పాఠ‌శాల‌లు వంటి ప‌థ‌కాలు కూడా కార‌ణ‌మని పేర్కొంటున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత దేశంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారాయి.


ఉత్త‌రప్ర‌దేశ్‌లో జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఇటీవ‌ల కాలంలోనే మొద‌టి సారిగా కొంత మేర‌కు ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లారని అంటున్నారు. బీజేపీకి విరుగుడుగా కాంగ్రెస్ పుంజుకుంటున్నదని చెబుతున్నారు. దీని ప్రభావం తెలంగాణపైనా ఉన్నదని చెబుతున్నారు. తెలంగాణతోపాటు.. రాబోయే ఛత్తీస్‌గఢ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూడా సానుకూల ఫ‌లితాలు కాంగ్రెస్‌ పార్టీకి వ‌స్తే బీజేపీని, మోదీని ఓడించే శ‌క్తి దేశంలో కాంగ్రెస్‌కే ఉంటుంద‌నే భావ‌న మైనారిటీల్లో బలంగా నాటుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ‌లో కూడా మైనారిటీలు కాంగ్రెస్ వైపు మ‌ళ్లే అవ‌కాశాలు మెండుగా ఉండ‌టంతో ఇటీవ‌ల కాలంలో ఎంఐఎం అధినేత కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేసుకున్నట్టు కనిపిస్తున్నదని వారు ప్రస్తావిస్తున్నారు.

బీఆరెస్‌-బీజేపీ దోస్తీతో ముస్లిం ఓటర్లలో అనుమానాలు

బీఆరెస్, బీజేపీ ఒక్క‌టే అన్న అభిప్రాయాలు ఇటీవలి కాలంలో ప్రజల్లోకి బాగా వెళ్లాయి. కొన్ని పరిణామాలు కూడా వాటిని ధృవీకరించేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బండి సంజ‌య్‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి బాధ్య‌త‌ల నుంచి తొల‌గించి కిష‌న్‌రెడ్డిని నియ‌మించ‌డం, ఆ త‌రువాత బీజేపీలో ఊపు త‌గ్గిపోవ‌డం, ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను అరెస్టు చేయ‌క‌పోవ‌డం లాంటి ర‌క‌ర‌కాల ప‌రిణామాలు మైనార్టీల్లో ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయని చెబుతున్నారు.


ఎక్కువ శాతం ప్ర‌జ‌లు మాత్రం బీజేపీతో బీఆరెస్ త‌ల‌ప‌డ‌ద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తున్నది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి వ‌స్తే బీజేపీ మద్దతు త‌ప్ప‌కుండా బీఆరెస్‌కే ఉంటుంద‌నే అనుమానాలు లేక‌పోలేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ అనుమానం ఎప్పుడైతే బ‌ల‌ప‌డుత‌దో అప్పుడు ముస్లింలు బీఆరెస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూసే అవ‌కాశం ఉంటుందంటున్నారు.

పలుకుబడి పెంచుకునే వ్యూహమా?


బీఆరెస్‌తో సంబంధాలు కొన‌సాగించుకుంటూనే త‌మ మ‌ద్ద‌తు లేకుండా 60 సీట్లు కూడా రావ‌ని ప‌రోక్షంగా ఎంఐఎం చెప్పడం వెనుక రాష్ట్రంలో తమ పలుకుబడిని పెంచుకునే లక్ష్యం కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదివ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో 4 సీట్లతో స‌రిపెట్టుకున్న ఎంఐఎం.. తెలంగాణ ఆవిర్భవించాక 7 సీట్లుకు పెరిగింది. ఇదే విధంగా నెమ్మ‌దిగా సీట్లు 10కి పెంచుకోవాల‌నే ప్రయత్నాల్లో ఉన్నది. ఈ క్రమంలోనే అధికార పార్టీతో ఎంఐఎం అధినేత అధికార పార్టీతో అంట‌కాగుతూ మెల్ల మెల్ల‌గా త‌మ ఉనికిని పెంచుకోవ‌డ‌మే ఆపార్టీ ప్ర‌ణాళిక అంటున్నారు.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో హంగ్ ఏర్ప‌డితే ఎంఐఎం పాత్ర కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ మేయ‌ర్‌, డిప్యూటి మేయ‌ర్ ఎన్నికల తరహాలోనే రాష్ట్రంలోనూ కీలక శక్తిగా ప్రాబలం పెంచుకోవాలనేదే ఎంఐఎం ఉద్దేశంగా చెబుతున్నారు. ఒక‌ర‌కంగా బీఆరెస్ గెల‌వాలి కానీ బీఆరెస్‌కు మెజారిటీ రాకూడదని, తమ మ‌ద్ద‌తు ద్వారానే బీఆరెస్ అధికారంలో ఉండాల‌ని ఎంఐఎం భావన అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు, రాజకీయ అంశాలు ఎలా ఉన్నా.. మైనార్టీలు ఏ పార్టీకి త‌మ అమూల్య‌మైన ఓటు వేస్తార‌న్న‌ది ప్రస్తుత పరిస్థితుల్లో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.