అవినీతికి నిలువుటద్దం ఎమ్మెల్యే ఆల: డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి

  • అధికారం అడ్డు పెట్టుకుని దోపిడీ
  • కొత్తకోట సభలో మంత్రి హరీష్ రావు అబద్ధాలు
  • డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతికి నిలువుటద్దమని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు గౌని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే ముసుగులో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అబద్ధాలతో మళ్ళీ అందలం ఎక్కాలని చూస్తున్నారని అన్నారు. గురువారం దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో జరిగిన సమావేశంలో గౌని మాట్లాడారు. మంత్రి హరీష్ రావును తీసుకువచ్చి నియోజకవర్గానికి తానేదో ఉద్ధరించినట్టు, బహిరంగ సభలో చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.



కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, డిగ్రీ కాలేజ, ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని, 30 పడకల ఆసుపత్రికి నిర్మిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో ఆస్పత్రికి శంకుస్థాపన చేయడం అంటే ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. మంత్రి హరీష్ రావు వస్తే చెక్ డ్యామ్ నిర్మాణాల్లో అవకతవకలను చూపిస్తామన్నారు. ఎమ్మెల్యే ఇసుక దోపిడీకి పాల్పడ్డాడని ఆధారాలతో సహా నిరూపిస్తే చర్యలు తీసుకోలేదన్నారు.



చిన్నచింతకుంట మండలం అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన డ్యామ్ మూడు నెలలకే లీకేజీలు వచ్చాయన్నారు. కమీషన్ల కోసం శ్మశానంలో చెక్ డాం నిర్మించిన ఘనుడు కమీషన్ల వెంకటేశ్వర్ రెడ్డి అని నిరూపిస్తామన్నారు. 20 శాతం కమీషన్ హరీష్ రావుకు ముట్టినందుకే, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.



ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందన్న హరీష్ రావు, గతంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. హరీష్ రావు జిల్లా పర్యటనలో ఎమ్మెల్యేలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని, ఆయన చదివిన స్క్రిప్ట్ అంతా అబద్ధం అని ఖండించారు.