సచివాలయం నిర్మాణంలోనూ రాచరికపు ఆనవాళ్లు
పట్టణాల పేర్లను కూడా మార్చాలి
బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు తొలగిస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి తన విధానంపై ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలనుకున్న సీఎం, కేబినెట్‌లు కొత్త లోగోలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా అమరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఇదే కాంగ్రెస్ 1970లో తొలిదశ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మందిని బలి తీసుకుందని గుర్తు చేశారు.
చిహ్నంలో అమరుల స్తూపాన్ని పెట్టడంలో తమకు అభ్యంతరమేం లేదని, రాష్ట్ర గీతంపై ఇబ్బంది లేదన్నారు. అధికారిక చిహ్నం విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైన చార్మినార్‌ను తొలగించడం కాదని.. ముస్లిం పాలకుల ఆనవాళ్లను మొత్తమే తొలగించాలని డిమాండ్ చేశారు.బీజేపీ వచ్చాక ముస్లిం పాలకుల ఆనవాళ్లను తొలగించడంపై పూర్తిస్థాయిలో ఆలోచన చేస్తామన్నారు.రాచరికపు ఆనవాళ్లను తొలగిస్తున్నామని కాకతీయ తోరణాన్ని లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమన్నారు. కాకతీయ తోరణం రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనన్నారు. ముస్లిం దురాక్రమణదారులు హిందువులపై అరాచకాలు చేసి పాలన సాగించారని వారికి వ్యతిరేకంగా కాకతీయులు పోరాటం చేశారన్నారు.
ఎదులాపురంను ఆదిలాబాద్, లష్కర్‌ను సికింద్రాబాద్, ఎలగందులను కరీంనగర్ , పాలమూరును మహబూబ్ నగర్‌గా, మానుకోటను మహబూబాబాద్ గా, ఇందూరును నిజామాబాద్‌గా, భాగ్యనగర్‌ను హైదరాబాద్‌గా ముస్లిం పేర్లతో మార్చారని, వాటిలోనూ రాచరికపు పోకడలు కనిపించడం లేదా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వీటిని ఎందుకు మార్చడం లేదన్నారు. ముస్లిం ఓట్ల కోసం పాకులాడే కాంగ్రెస్.. ఇప్పటికైనా సాంస్కృతిక పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ కొత్త సచివాలయంలో 34 గుమ్మటాలు ఒవైసీ ఆనందం కోసం నిర్మించారని.. వాటిని ఎందుకు తొలగించడం లేదన్నారు. సచివాలయంపై రాచరికపు ఆనవాళ్లు సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సోనియాగాంధీని బలిదేవతగా పిలిచి చివరకు రేవంత్ రెడ్డి ఆమెకు భక్తుడిగా మారాడని సెటైర్లు వేశారు. సుష్మా స్వరాజ్, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. కనీసం సుష్మా స్వరాజ్ పేరు కూడా సీఎం ప్రస్తావన చేయకపోవడం ఆవేదనకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ కాంగ్రెస్ లో లేకపోవడం, తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీలో ఆయన ఉండటం వల్ల ఆయనకు చరిత్ర సరిగ్గా తెలియదనుకుంటానన్నారు. రేవంత్ చరిత్ర తెలుసుకోవాలని, తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన బీజేపీ నేతలను కూడా ఆవిర్భావ వేడుకలకు పిలువాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల ప్రతి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామన్నారని.. మరి ఇంకెప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు.