సూట్ కేసులకు బీజేపీ అమ్ముడు పోదు: ఎమ్మెల్యే రఘునందన్ రావు

సూట్ కేసులకు బీజేపీ అమ్ముడుపోయే పార్టీ కాదని, రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందనీ, సిద్ధాంత లక్ష్యంగా పనిచేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ కాదని, రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందనీ, సిద్ధాంత లక్ష్యంగా పనిచేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆదివారం నిర్వహించిన మెదక్ నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాకలో బుద్ధి చెప్పినట్టే ఇక్కడ కూడా బీఆరెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీలలో మాదిరిగా టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరే నాయకులు బీజేపీలో లేరని స్పష్టం చేశారు. బీ ఫామ్ ఎవరికిచ్చినా కష్టపడి పని చేస్తారని అన్నారు. తెలంగాణ వస్తే జీవితాలు మారుతాయి అనుకున్నామని, అయినా మారలేదు అన్నారు.

విద్యార్థి ఆత్మహత్యను తప్పుదోవ పట్టించారు..

గ్రూప్ 2 వాయిదా పడి మనస్తాపంతో విద్యార్థి ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడగా, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారనీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మానవతా దృక్పథంతో ఆలోచించకుండా ప్రవళిక మరణానికి ప్రేమ వ్యవహారమని పోలీసులతో స్టేట్మెంట్ లు ఇప్పిస్తున్నారని, ఇది దారుణమన్నారు. కేసీఆర్ పరిపాలనలో వచ్చిన కరెక్ట్ నోటిఫికేషన్ కేవలం వైన్ షాపులకు మాత్రమే అని ఎద్దేవా చేశారు. అరకొర వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు లీకులు అవుతాయి లేదా కోర్టుకు వెళ్లి స్టే తెస్తారనీ ఆరోపించారు. తెలంగాణ రాక ముందు మద్యం ద్వారా పదివేల కోట్ల ఆదాయం వచ్చేది, కానీ తెలంగాణా వచ్చిన తరువాత కిరాణం షాపులో ఉప్పు, పప్పులు అమ్మే విధంగా బెల్ట్ షాపులను పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారన్నారు. మద్యంతో పది సంవత్సరాల్లో రూ. 40 వేల కోట్లకు ఆదాయం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేశాడని విమర్శించారు. మూడోసారి అధికారంలోకి రావడం కోసమే మ్యానిఫెస్టోను రూపొందించారని, ఈ మ్యానిఫెస్టో మోచేతికి బెల్లంపెట్టినట్టు ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నూటికి 99 మంది ఓడిపోతారని అనుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నాయకులు నందా రెడ్డి, నందు జనార్ధన్, నల్లాల విజయ్ పాల్గొన్నారు.