విధాత : ఓ ప్రవైటు టీవి చానల్ నిర్వహించిన ఓపెన్ డిబెట్ కార్యక్రమంలో మాటామాటా పెరుగడంతో ఆగ్రహం అదుపు చేసుకోలేని కుత్భుల్లాపూర్ బీఆరెస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేయడం రగడకు దారితీసింది. చర్చలో ఎమ్మెల్యే వివేక్ ను నువ్వు కబ్జా దారు మీ అయ్య కబ్జాదారు అంటూ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విమర్శలు చేశారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వివేకానంద ఒక్కసారిగా కూన శ్రీశైలం గౌడ్‌పై దాడి చేసి అతని గొంతు పట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో రెచ్చిపోయిన రెండు పార్టీల కార్యకర్తలు సైతం ఒక్కసారిగా స్టేజీపైకి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేసారు. పరస్పరం తన్నులాటకు దిగారు. ఇరువర్గాల దాడులతో చర్చా కార్యక్రమం రసాభాసగా మారింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. కాగా ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ చర్యను తీవ్రంగా ఖండించారు. కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్ పై దాడి హేయనీయమని, ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
భౌతిక దాడులతో భయాందోళనలు సృష్టించి గెలవాలని చూస్తున్నారన్నారు. బీజేపీ తల్చుకుంటే మీరు కూడా రోడ్లపై తిరగలేరని, మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దన్నారు. మీ అరాచక పాలనకు స్వస్తి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, కూన శ్రీశైలంపై దాడికి పాల్పడిన బీఆరెస్ అభ్యర్ధిపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.