తెలంగాణకు దెయ్యంలా మారిన మోడీ: మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం

విధాత: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు రాకుండా అడ్డుకుంటున్న నరేంద్ర మోడీ రాష్ట్రానికి దెయ్యంలా మారార‌ని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రూ.3 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో క‌లిసి జగదీష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని, గుజరాత్ రాష్ట్రంలో మంచి నీటి కోసం గొడవలు ఇప్పటికీ […]

  • Publish Date - January 5, 2023 / 01:34 PM IST

విధాత: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు రాకుండా అడ్డుకుంటున్న నరేంద్ర మోడీ రాష్ట్రానికి దెయ్యంలా మారార‌ని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రూ.3 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో క‌లిసి జగదీష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

దేశంలో ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని, గుజరాత్ రాష్ట్రంలో మంచి నీటి కోసం గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పై అక్కసుతోనే తెలంగాణపై బిజెపి ప్రభుత్వం కక్ష్యసాధింపుకు పాల్పడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుందన్నారు. ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసింది మోడీనే అని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్న దుర్మార్గుడు మోడీ అన్నారు. మోడీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతన్నల మోటర్లకు మీటర్లు పెట్టినివ్వను అని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నారు.

దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశానికి అన్నం పెట్టేది మన తెలంగాణ రైతన్న అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలని, దేశమంతా అభివృద్ధి జరగాలనే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చారన్నారు.

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారధ్యంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి తప్ప వేరే ధ్యాస లేని నిస్వార్థపరుడు అని, అలాగే చిట్యాల మున్సిపాలిటినీ ఏర్పాటు చేయించిన ఘనత చిరుమర్తి లింగయ్యదేనన్నారు. ఇంకా ఆయ‌న చొరవతోనే అయిటిపాముల లిఫ్ట్, మూసీ ప్రాజెక్ట్ కు నిధులు మంజూరయ్యాయన్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలంటే కేసీఆర్ ప్రధాని అవ్వాల్సిందేనన్నారు.

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ యావత్ దేశమంతా కేసీఅర్ నాయకత్వాన్ని కోరుతోందన్నారు. దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని, కేసీఅర్ సంక్షేమ పథకం అందని గడపే తెలంగాణలో లేదన్నారు.

సిఎం కేసీఆర్ ఆశీస్సులతోనే చిట్యాల పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. కేటిఆర్ సహయ సహకారాలతో అభివృద్ధిలో అగ్రగామిగా చిట్యాల మున్సిపాలిటి నిలుస్తోందని, ఇప్పటికే రూ.20 కోట్లతో చిట్యాల పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు. పనిచేసే నాయకులకు, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలన్నారు.