కరెంట్ తీగలు పట్టుకోవడానికి సిద్ధం.. లాగ్ బుక్‌లు తీసుకొచ్చి నిరూపించు: కేటీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి సవాల్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కరెంటు తీగలను పట్టుకునేందుకు కూడా తాను సిద్ధమేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లాగ్ బుక్కులు తెచ్చి, 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కొమ్మిశెట్టి నర్సింలు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వంగాల కృష్టయ్య, మాజీ సర్పంచ్ ఓంకార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులకు ఎంపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరుకు చెందిన బీఆర్ఎస్ నేతలు మహిళా నాయకులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. గృహలక్ష్మీ పేరుతో రూ.3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ పథకాలన్ని ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమేనన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చెప్పిన ఆరు గ్యారెంటీలు చిన్న పథకాలే అయినా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.



ఆలేరు లో సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని, ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్నారు. కేసీఆర్ బండారం మోడీ బయట పెట్టాడన్నారు. యాదగిరి గుట్ట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు. కాంగ్రెస్ డబ్బులతో పోటీ పడలేదు కానీ పథకాలతో పోటీ పడుతోందని తెలిపారు. పథకాలు అమలు కాకపోతే నా పదవులకు రాజీనామా చేస్తానని చెప్పారు.