– రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తాం : సుహాసిని రెడ్డి
– నర్సాపూర్ లో మారనున్న రాజకీయ సమీకరణలు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో రాజకీయ వేడి రోజురోజుకూ రాజుకుంటోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరిక నుంచి పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించారు. బీఆరెస్ శ్రేణులను తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఅర్ఎస్ ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుహాసిని రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఏకంగా 25 సంవత్సరాల పాటు చక్రం తిప్పిన స్వర్గీయ విఠల్ రెడ్డి స్వయానా కోడలు సుహాసిని రెడ్డి. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో అన్ని తానై వ్యవహరిస్తున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ నేతలు ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు గౌడ్ లను వెంట పెట్టుకొని కోడిపల్లికి వెళ్లారు. సుహాసిని రెడ్డి కుటుంబంతో చర్చలు జరిపారు. కుమారుడు చిలిపిచెడ్ మండల జడ్పీటీసీ గా పని చేశారు. తల్లీకొడుకులను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మైనంపల్లి కోరారు.
అనుచరులతో చర్చించి 2 రోజుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. చిలిపిచెడ్ జడ్పీటీసీగా ఉన్న చిలుముల శేష సాయిరెడ్డి బీఅర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేసి, తన పదవికి గతంలోనే రాజీనామా చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని మోసం చేశారంటూ ఆయన బీఅర్ ఎస్ పై ఆగ్రహంగా ఉన్నారు. చిలుముల సుహాసిని రెడ్డి భర్త కిషన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం మరణించారు. ఆయనకు టిఆర్ఎస్ కేంద్ర మంత్రిత్వ కార్మిక శాఖలో కీలక పదవి ఇచ్చింది. సీఎం కేసీఆర్ గతంలో ఈ కుటుంబానికి మంచి అవకాశం ఇచ్చారు. సుహాసిని రెడ్డి భర్త కిషన్ రెడ్డి మరణించినప్పటి నుంచి బీఅర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. కాగా నర్సాపూర్ నియోజకవర్గంలో చిలుముల విఠల్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి కాకుండా, మాజీ మంత్రి మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డికే టికెట్ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ అధికారం ఖాయం
మైనంపల్లి హన్మంతరావు
నర్సాపూర్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చిలముల విఠల్ రెడ్డి కుటుంబం ఎంతో సేవ చేసింది. 20014లో బీఆరెస్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఈ కుటుంబానికి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. సుహాసిని రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని. వారు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శేషశైనారెడ్డి జడ్పీటీసీ గా సేవలు అందించారని, 3 సంవత్సరాలకే బీఅర్ఎస్ విధానాలు నచ్చక రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.