పుస్తకావిష్కరణ సభలో మంత్రి కేటీఆర్
విధాత: ప్రజాస్వామిక సామరస్య విలువలను ‘నడక’ పుస్తకంలోని వ్యాసాలు ప్రతిబింబిస్తాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ‘నడక’ పుస్తకాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు.
ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. శ్రీనివాస్ దేశ, రాష్ట్ర సామాజిక స్థితిగతులపై ఈ పస్తకంలో చక్కగా విశ్లేషించారని, కాలానుగుణంగా రాసిన ఈ వ్యాసాలన్నీ తెలంగాణకు సందర్భోచితంగా ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల డిమాండ్స్, హక్కులపైన సముచితమైన వ్యాసాలు రాసినారని మంత్రి అభినందించారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని, ఇందులోని అంశాలు తెలంగాణ సమాజంలో విస్తృతంగా ప్రచారం జరగాలన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, వికాస సమితి అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాల స్వామి, సీనియర్ జర్నలిస్ట్ ఆసరి రాజు పాల్గొన్నారు.