Nagarjuna Sagar | హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో.. కృష్ణా నది( Krishna River )కి వరద పోటెత్తింది. దీంతో కృష్ణా నది ఉరకలేస్తుంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా( Nallagonda District )లోని నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. వరద నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది.
ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర, 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 3.83,170 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,15,483 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,34,176 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది.
ఇక దసరా సెలవులు కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకేసారి 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో.. పాల పొంగులా ఎగిసిపడుతున్న ఆ జల దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తూ.. ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నారు.