Nagarjuna Sagar | నల్లగొండ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. జూరాల గేట్లు ఎత్తడంతో.. దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. కృష్ణా నది ఉధృతంగా ఉరకలేస్తుండడంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి 26 గేట్లు ఎత్తడంతో.. నీటి ప్రవాహం పాల పొంగును తలపిస్తోంది. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తారు. సాగర్ అందాలను చూసి మురిసిపోతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,92,997 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,73,053 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 583 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 291.66 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,98,022 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,13,540 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,595 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్ వే గేట్లను 18 అడుగులు ఎత్తి 4,18,630 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 197.01 టీఎంసీలుగా ఉంది.