నకిరేకల్ కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి ప్రసన్నరాజు.. కండువా కప్పిన కేటీఆర్

  • Publish Date - November 10, 2023 / 02:19 PM IST

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నకిరేకల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన నల్లగాటి ప్రసన్న రాజ్ శుక్రవారం గులాబీ గూటికి చేరారు. రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో కారు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ఆయన గులాబీ జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించే నేతలకు, రౌడీలకు స్థానం ఇవ్వవద్దని సూచించారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కి ఓటు వేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పారు. రౌడీ రాజకీయాలు చేసే కోమటిరెడ్డి సోదరులకు, వేముల వీరేశంకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో చిరుమర్తి లింగయ్య, చెరుకు సుధాకర్, ప్రసన్నరాజు అనుచరులు పాల్గొన్నారు.