విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నారాయణ పేట నియోజకవర్గంలో అభివృద్ధి లేక వెనుకబడిందని కాంగ్రెస్ అభ్యర్థి పర్ణిక రెడ్డి విమర్శించారు. గురువారం నియోజకవర్గంలోని ధన్వాడ, నారాయణ పేట మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాల్లో పర్ణిక మాట్లాడుతూ ఇన్ని రోజులు గద్దెపై కూర్చున్న ఇక్కడి నేత పేట అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఎక్కడా న్యాయం జరగలేదని, అందుకే వారంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారన్నారు.
మా తాత చిట్టెం నర్సిరెడ్డి ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని, ఆయన హయాంలో ఈ ప్రాంతం గుర్తింపునకు నోచుకుందని పర్ణిక అన్నారు. అప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుందని, ఈ పదేళ్లు బీఆర్ఎస్ అధికారం ఉన్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ ల పథకంతో పేదలకు మేలు చేకూరుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల కోసం ప్రతి నెలా వారి బ్యాంక్ అకౌంట్లలో రూ.2500 పడతాయని, అలాగే ఆసరా కింద ప్రతి నెలా రూ.4000 పెన్షన్ వస్తుందని, రూ.500లకే గ్యాస్ బండ, రైతుల బాగు కోసం బృహత్తర పథకాలు ప్రవేశ పెట్టారని ఆమె తెలిపారు. రైతు బంధు, కౌలు రైతులకు రైతుబంధు అందించే పథకం రూపొందించి రైతులను అగ్రస్థానంలో నిలపడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఆమె అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందనే నమ్మకం ప్రజలకు వచ్చిందన్నారు.
ఈసారి కాంగ్రెస్ ను అందరిస్తే నారాయణ పేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, ఈసారి కాంగ్రెస్ కు అవకాశం కల్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పర్ణిక ఆధ్వర్యంలో నారాయణ పేట మండలంలోని శాంసన్ పల్లిలో బీఆర్ఎస్ నుంచి 150 మంది కార్యకర్తలు పర్ణిక సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ధన్వాడ మండలం లోని చర్లపల్లి, చీకర్ల తండాకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి ప్రచార నిమిత్తం వచ్చిన పర్ణికకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు.