విధాత, మెదక్ బ్యూరో: ధాన్యం సేకరణలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్‌ను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌కు సరెండర్ చేశామని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సోమవారం తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలను పంపకపోవడం, లారీలు సమకూర్చి ధాన్యం బస్తాలు వేసుకోవడానికి కాంట్రాక్టర్లు, డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది సబబు కాదని హెచ్చరించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, అవసరమైన గన్ని బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు సకాలంలో సమకూర్చకపోవడం తదితర కారణాల దృష్ట్యా జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకొచ్చారని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించడంలో, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు చెల్లించడంలో జాప్యం అయినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.
ధాన్యం సేకరణ ఏజెన్సీల నుంచి అగ్రిమెంట్లు సేకరించడం తదితర విషయాలలో సక్రమంగా విధులు నిర్వహించకపోవడం వల్లే గోపాల్‌ను సరెండర్ చేశామని ఆయన తెలిపారు. కాగా జిల్లా మేనేజర్ బాధ్యతలను జిల్లా పౌర సరఫరాల అధికారికి బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.