విలువ‌ల్లేవు.. విధానాల్లేవు, టికెట్లే ప‌ర‌మావ‌ధిగా అన్ని పార్టీల నేత‌లు

  • Publish Date - October 29, 2023 / 05:33 PM IST
  • గ‌తంలో ద‌శాబ్దాల‌పాటు అదే పార్టీలో
  • యువ‌నేత‌లుగా వ‌చ్చి.. అధినేత‌లై..
  • రాజ‌కీయాల‌ను వెలిగించిన నేత‌లు
  • అప్ప‌టిలో సిద్ధాంతాల‌కే క‌ట్టుబాటు
  • పార్టీ గెలిచినా ఓడినా.. అందులోనే
  • ప‌ద‌వి ఉన్నా లేకున్నా.. ప్ర‌జ‌ల్లోనే
  • దారుణంగా స‌మ‌కాలీన రాజ‌కీయం
  • టికెట్ రాకుంటే మ‌రో పార్టీలోకి జంప్‌
  • రాజ‌కీయాల‌ను శాసిస్తున్న డ‌బ్బులు
  • డ‌బ్బున్న‌వాళ్లే ఎన్నిక‌ల బ‌రిలోకి
  • కోట్లు ఖ‌ర్చు చేస్తేనే విజ‌యావ‌కాశాలు

విధాత ప్ర‌త్యేకం: ఒక‌ప్పుడు ఏ పార్టీ నేత‌లు ఎవ‌రో ఇట్టే చెప్ప‌గ‌లిగేవారు! ఓ ప‌దేళ్లు కోమాలో ఉండి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారికి కూడా ఏ నాయ‌కుడిది ఏ పార్టీయో చెప్ప‌గ‌లిగే ప‌రిస్థితి ఉండేది! ఎందుకంటే అప్ప‌ట్లో సిద్ధాంతాలు, విధానాల ప్రాతిప‌దిక‌నే రాజ‌కీయాలు న‌డిచేవి. ఆ రాజ‌కీయాల‌కు అనుగుణంగానే ఆయా పార్టీలు ఉండేవి. త‌మ పార్టీ గెలిచినా.. ఓడినా.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి.. తుదిశ్వాస‌వ‌ర‌కూ అదే పార్టీలో కొన‌సాగుతుండేవారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. అది నాలుగు గోడ‌ల మ‌ధ్య ప‌రిమితం! కాదంటే.. బ‌య‌ట విమ‌ర్శ‌లో, విసుర్లో! విద్యార్థి ఉద్య‌మాల నుంచి, యువ‌జ‌నోద్య‌మాల నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ అత్యున్న‌త ప‌ద‌వులు అలంక‌రించి.. రాజ‌కీయాల‌ను వెలిగించి నేత‌లెంద‌రో ఉన్నారు! ఎక్క‌డో.. ఎప్పుడో త‌ప్ప పార్టీలు మారిన సంద‌ర్భాలు క‌నిపించ‌వు. అదీ కిందిస్థాయిలోనే ఉంటుండేవి! కానీ.. ఇప్పుడు? రాజ‌కీయాలు మారిపోయాయి. కిందిస్థాయి లేదు.. పై స్థాయి లేదు! విలువ‌ల్లేవు.. విధానాల్లేవు! ఉన్న పార్టీలో టికెట్ దొర‌క్క‌పోతే పార్టీ మార్చేయ‌డ‌మే! ప్ర‌తిపక్షంలో ఉండి.. అధికార పార్టీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన నాయ‌కులు.. టికెట్ ఇస్తామంటే చాలు.. అధికార ప‌క్షంలోకి జంప్ అయిపోతున్నారు! మీ అంత గొప్ప నాయ‌కుడు ఇక‌పై పుట్ట‌డ‌నేంత స్థాయిలో నీరాజ‌నాలు ప‌లుకుతారు! అధికార పార్టీలో టికెట్ దొర‌క్క‌పోతే.. అప్ప‌టిదాకా ప్ర‌శంస‌ల వ‌ర‌ద‌పారించిన నాయ‌కులు.. ఇప్పుడు అదే అధినాయ‌క‌త్వంపై బుర‌ద జ‌ల్లేందుకూ వెనుకంజ వేయ‌డం లేదు. పొద్దున ఒక పార్టీలో చేరితే.. సాయంత్రానికి మ‌ళ్లీ పార్టీ మార్చిన నేత‌లూ ఉన్నారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వికృత సంస్కృతి.. ఇప్పుడు రాజ‌కీయాల‌ను, ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న‌ది. మ‌ళ్లీ ఇదే నాయ‌కులు.. ప్ర‌జాస్వామ్యం గొప్ప‌త‌నం గురించి గొప్ప‌గా చెబుతుంటారు. నిన్న‌టికి నిన్న పాలేరు స‌భలో కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి విజ‌యం కోసం నిర్వ‌హించిన స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పూట‌కో పార్టీ మారేవాళ్ల‌కు ఓట్లేయ‌కండి అని పిలుపునిచ్చారు. నిజానికి ఎవ‌రినైతే గెలిపించాల‌ని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారో.. అదే ఉపేంద‌ర్‌రెడ్డి.. గ‌తంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే!

వైఎస్ హ‌యాంలో పుంజుకుని.. నేడు విచ్చ‌ల‌విడి

నేత‌ల పార్టీ మార్పు, రాజ‌కీయ బేర‌సారాలు చాలా కాలం నుంచి ఉన్న‌వే అయిన‌ప్ప‌టికీ.. ఉద్య‌మంలా పార్టీ మార్పిడులు వైఎస్ కాలంలో మొద‌ల‌య్యాయ‌ని, అవి నానాటికి పెరుగుతూ పెరుగుతూ.. ఇప్పుడు విక‌టాట్ట‌హాసాలు చేస్తున్నాయ‌ని రాజకీయ విశ్లేష‌కుడొక‌రు చెప్పారు. ప్ర‌త్యేకించి రాజ‌కీయాల్లో డ‌బ్బు ప్ర‌వాహం, ప్ర‌భావం బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు నేరుగా రాజ‌కీయాల‌ను శాసించే స్థితికి అది చేరుకున్న‌ది. దీంతో వ్యాపార‌స్థులు, కాంట్రాక్ట‌ర్లు, పారిశ్రామిక వేత్త‌లు, ఇత‌ర డ‌బ్బులున్నబాబులే క్ర‌మంగా రాజ‌కీయాల‌ను ఏలుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. డ‌బ్బు ప్ర‌భావం రాజకీయాల్లో మొద‌లైన త‌రువాత సంప‌న్నులే రాజ‌కీయ నేత‌ల అవ‌తారం ఎత్తారు. చివర‌కు పార్టీ టికెట్ కావాలంటే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడ‌తావు? అని అడిగే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆయ‌న అన్నారు. రాజ‌కీయాల్లో డ‌బ్బు ప్ర‌భావం పెర‌గ‌డంతో సిద్ధాంతాలు గాలికి ఎగిరిపోయి, వాటి స్థానంలో రాజ‌కీయ బేర‌సారాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అన్నారు. జాతీయ పార్టీల ప్ర‌భావం త‌గ్గి, ప్రాంతీయ పార్టీలు ఉనికిలోకి వ‌చ్చిన త‌రువాత ఇది వికృత రూపం దాల్చింద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగ‌జారాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ సీఎంగా, కేంద్రంలో మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు కొంతమంది ఎంపీల‌ను ప్ర‌లోభ పెట్టార‌ని విమ‌ర్శలు వ‌చ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఆనాడు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన ఒక నేత‌ను వైఎస్ ట్రాప్ చేసి మ‌న్మోహ‌న్ సింగ్‌కు మ‌ద్దతుగా ఓటు వేయించార‌ని ప్ర‌చారం జ‌రిగింద‌ని, ఆనాడు టీడీపీ స‌ద‌రు ఎంపీపై చ‌ర్య‌లు తీసుకున్న‌ద‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. తాజాగా ఆ నాయ‌కుడు బీఆరెస్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. అదే తీరుగా తెలంగాణ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి నాడు అప్ప‌టి టీఆరెస్ ఎమ్మెల్యేల‌ను వైఎస్ ప్ర‌లోభ‌పెట్టార‌న్న‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఆ సంస్కృతిని పెంచి పోషించిన బీఆరెస్‌!

తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన బీఆరెస్.. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరుతో ఇత‌ర పార్టీల వారిని త‌నలో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ క్ర‌మంలో వ‌చ్చిన‌వారికి కొన్ని మంత్రి ప‌ద‌వులూ ఇచ్చింది. ఇలా రాష్ట్రంలో మొద‌ట టీడీఎల్‌పీని, రెండవసారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొని మంత్రి ప‌ద‌వులు ఇచ్చింది. దీనిపై సీరియ‌స్ అయిన కాంగ్రెస్ పార్టీ.. త‌మ ఎమ్మెల్యేల‌ను బీఆరెస్‌ కొనుగోలు చేసింద‌ని ఆరోపించింది. విశేషం ఏమిటంటే.. అప్ప‌టిదాకా కాంగ్రెస్‌, టీడీపీల్లో ఉన్న స‌ద‌రు నాయ‌కులు.. ఆ పార్టీల్లో ఉన్న‌ప్పుడు కేసీఆర్‌ను తీవ్రంగా విమ‌ర్శించిన‌వారే!

తాజా ఎన్నిక‌ల్లోనూ క‌ప్ప‌ల త‌క్కెడ‌లు

తాజాగా జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేత‌లు బ‌ట్ట‌లు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తుండ‌టం బుద్ధిజీవుల్లో మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీల‌కు, నేత‌లకు సిద్దాంతాలు, విధానాలున్నాయా? లేవా? అన్న చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. పార్టీలో టికెట్‌ ఆశించ‌డం త‌ప్పు కాదు. ఒక‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పార్టీలో ముగ్గురు, న‌లుగురు నేత‌లుంటే టికెట్ అంద‌రికి ఇవ్వ‌లేరు. ఎవ‌రో ఒక్క‌రికే టికెట్ ల‌భిస్తుంది. కానీ.. టికెట్ ద‌క్క‌క‌పోతే పార్టీ మారుడే అన్న‌ది ఒక ప్రాతిప‌దికగా త‌యారై కూర్చున్న‌ది. ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే.. మొన్న‌టి వ‌ర‌కు బీఆరెస్ విధానాల‌ను తీవ్రంగా విమ‌ర్శించిన సీనియ‌ర్ నేత‌, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య త‌న‌కు టికెట్ ఇవ్వ‌డం లేద‌ని తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే పార్టీ మార్చేశారు. త‌న‌కు రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను తీవ్రంగా విమ‌ర్శించేందుకూ సిద్ధ‌ప‌డుతున్నారు. తాను రెండు టికెట్లు అడిగితే ఇవ్వ‌లేద‌ని రాత్రికి రాత్రే పార్టీ మారి, రెండు టికెట్లు తెచ్చుకున్న నేత‌లు ఉన్నారు. ఉద‌యం ఒక పార్టీలో నుంచి మ‌రో పార్టీలో చేరి, సాయంత్రం తిరిగి మ‌రో పార్టీలో చేరుతున్నారు. ఇలా నేత‌ల గోడ‌లు దూకే తీరుపై ప్ర‌జ‌లే ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీలు కూడా ఏ పార్టీ నుంచి ఎవ‌రు వ‌చ్చి చేరుతారా? అన్న తీరులో ఎదురుచూస్తున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ది. ఎదుటిపార్టీలో ఎవ‌రికి టికెట్ రాలేదో చూసి.. వారిని ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిసి, పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం జాబితాలు, బీఫాం పంపిణీలు కూడా ఆపుతున్నారు.

టికెట్ కోసం ఒకరిద్ద‌రు నాయ‌కులు ట‌క‌ట‌కా రెండు పార్టీలు మారారు.. తీరా ఏ పార్టీలోనూ టికెట్ రాలేదు. తాజాగా నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాక‌పోవ‌డంతో పార్టీ మారారు. ఒక సీనియ‌ర్ నేత టికెట్ రాక పోవ‌డంతో పార్టీ మారినా టికెట్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు.. కేవ‌లం త‌న‌కు టికెట్ ఇవ్వ‌ని పార్టీపై క‌క్ష‌తోనే పార్టీ మారార‌న్న చ‌ర్చ న‌డుస్తున్న‌ది. ఈ ఎన్నిక‌ల సీజ‌న్‌లో దాదాపు వంద మంది నేత‌లు ఇలా పార్టీలు మార‌డం రాష్ట్ర రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్ గా మారింది.