వందరోజుల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత, హామీల అమలుకు జనం ఎదురుచూపులు … కేంద్ర మంత్రి బండి సంజయ్

రాష్ట్రంలో బీఆరెస్ మీద వ్యతిరేకతతో గద్దెనెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వంద రోజుల్లోనే వ్యతిరేకత వచ్చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

  • Publish Date - June 30, 2024 / 03:31 PM IST

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆరెస్ మీద వ్యతిరేకతతో గద్దెనెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వంద రోజుల్లోనే వ్యతిరేకత వచ్చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు తీరుపై ప్రజల్లో చర్చ సాగుతుందని, ఎన్నికల హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూపులు పడుతున్నారన్నారు. పల్లెల్లో ప్రజలు రూ.4 వేల పెన్షన్, ప్రతి మహిళకు రూ.2,500 గురించి కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారని, రైతు భరోసా రూ.15వేలు ఎప్పుడిస్తారంటూ అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆరెస్ చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు వస్తున్నాయని.. బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని సంజయ్‌ ఆరోపించారు. తాము కూడా అలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ అభివృద్ధి జరగదని హెచ్చరించారు.

కాంగ్రెస్ ఎంపీలకు తాము నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ మీద తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తిరుగుబాటు చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అందరికీ సమానంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ రకమైన వివక్ష పాటించడ మంచిది కాదని, కేంద్రంలో తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నా.. తమ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. రాజకీయాల్లో అవసరాన్ని పార్టీలు మారడం అలవాటుగా మారిందని, పార్టీలు మారే వారి విజ్ఞతపైన ఆ విషయం ఆధార పడివుందన్నారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి నడిచే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.

Latest News