– బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగినట్లు అవుతుందని, బీఆర్ఎస్ కి ఓటేస్తే అభివృద్ధి బాటలో నడుస్తామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి, కోమట్పల్లి, కోమటిపల్లి తండా, రామాయంపేట తండాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బోనాలు, డప్పు చప్పులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మెదక్ తో పాటు రామాయంపేట పట్టణం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల ద్వారా రూ.45 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెపుతూ ప్రజలను మోసం చేస్తుందని, ఆ పార్టీ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెళ్లిళ్లు చేయడం భారంగా మారుతోందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు చెప్పారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే రూ.2,000 పెన్షన్ లో రూ.1,100లు గ్యాస్ సిలిండర్కి పోతున్నాయని ఆలోచించి, గ్యాస్ సిలిండర్ ధరను రూ.400లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అంటుండగా, ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధు నిలిపి వేయాలని అంటున్నాడని ఆరోపించారు. డ్వాక్రా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం తీసుకు వచ్చినట్టు తెలిపారు.ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.