కన్నీళ్లు పెట్టుకున్న పటేల్‌..ఉమాలు

  • Publish Date - November 10, 2023 / 02:27 PM IST

విధాత : సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ దక్కని పటేల్ రమేశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కొందరు నాయకులు, కోవర్టులు ఒక వైపు ఉంటే, ప్రజలు మాత్రం నా వెంట ఉన్నారన్నారు. ప్రజల ఆశ్వీర్వాదం ఉన్నన్ని రోజులు కోవర్టు రాజకీయాలు పనిచేయవని, ప్రజల ఆశీస్సులు, అభిమానం ఉన్న స్థానికుడినైన తనను మంచి మెజార్టీతో గెలిపించడానికి సూర్యాపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. శుక్రవారం ఆయన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం తాను నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశానని, అవన్ని బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయన్నారు.



పార్టీ సభ్యత్వాలలో 55వేల మందితో తెలంగాణలో నియోజకవర్గాన్ని ముందుంచామన్నారు. పార్టీ ఆగ్రనాయకులు సోనియా, రాహుల్‌లు దేశం కోసం ఇబ్బందులు, కష్టాలు పడుతుంటే కింది స్థాయి నాయకులు పార్టీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనకు టికెట్ రాలేదని తెలిసిన తెల్లారి గంటల వ్యవధిలో 30వేల మందికిపైగా తరలివచ్చి సంఘీభావం చెప్పడం మరిచిపోనన్నారు. తనకు కేటాయించిన టికెట్‌ను ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నారని, మంత్రి జగదీశ్‌రెడ్డిని గెలిపించేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. కోర్టు రాజకీయాలకు కాలం చెల్లిందని, పార్టీని అమ్ముకునే ప్రయత్నాలను తిప్పికొట్టి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని రమేశ్‌రెడ్డి కోరారు.

బీజేపీ మాటలన్ని బూటకమే : తులా ఉమా

బీసీ సీఎం, సాలు దొర సెలవు దొర అంటూ బీజేపీ చెప్పే మాటలన్ని బూటకమేనని తేలిపోయిందని వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నాయకురాలు తులా ఉమా విమర్శించారు. చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని మార్చి వికాస్‌రావుకు టికెట్ కేటాయించడంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ తన పట్ల అగౌరవంగా వ్యవహారించిందన్నారు పార్టీలో మహిళలకు తగిన గౌరవం లేదన్నారు. టికెట్ నిరాకరించడానికి నా నక్సలైట్ నేపధ్యం సాకు చెప్పారని, ప్రజల కోసమే అందులో కూడా తాము పోరాడిన సంగతి మరువరాదన్నారు. ఎమ్మెల్యే టికెట్లు అడగనంత వరకు నేను మంచిదాన్నేనని, ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే మాత్రమే మంచివారం కాకుండా పోయామన్నారు.