పొత్తుపై బీజేపీ-జనసేన కీలక చర్చలు.. అమిత్‌షాతో కిషన్ పవన్ భేటీ

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ-జనసేన పార్టీల పొత్తు, సీట్ల సర్ధుబాటుపై ఆ రెండు పార్టీల అగ్రనేతలు బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 45నిమిషాలు వారు సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరిపారు. జనసేన తమకు పట్టున్న 32సీట్లలో పోటీ చేసేందుకు ముందుగా సన్నద్ధమైంది. అయితే బీజేపీ-జనసేన పొత్తు కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన నేపధ్యంలో ఆ రెండు పార్టీల నేతలు సీట్ల సర్ధుబాటుపై కీలక చర్చలు జరిపారు.

అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఆరు నుంచి ఏడు స్థానాలు ఇస్తామని ప్రతిపాదనలు చేసినట్లుగా తెలస్తున్నది. అమిత్‌షాతో చర్చల అనంతరం పవన్ కల్యాణ్ తిరుగు పయనమయ్యారు. అయితే బీజేపీ రెండో జాబితా, జనసేన సీట్ల ఖరారుకు సంబంధించి అధిష్టానంలో చర్చల కోసం కిషన్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండిపోయారు. నవంబర్ 1వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల భేటీ అనంతరం బీజేపీ రెండో జాబితా, జనసేన సీట్ల ఖరారు వివరాలు వెల్లడించవచ్చని కిషన్‌రెడ్డి తెలిపారు.