విధాత : సీఎం కేసీఆర్ సర్కారుపై రైతులతోపాటు మల్లన్న స్వామి కూడా ఆగ్రహంగా ఉన్నాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అందుకు నిదర్శనమని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ముసుగులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం తూప్రాన్, నిర్మల్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయ్ సంకల్ప సభల్లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆరెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఈ దఫా తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతున్నదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని, గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు భయపడే కామారెడ్డి పారిపోయాడని మోదీ ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌లలో ట్రైలర్ మాత్రమే చూశారని ఇక సినిమా చూస్తారని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం మళ్లీ మేమే
కేంద్రంలో 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయంతో కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుని డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. బీఆరెస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ పార్టీది సుల్తాన్‌ల పాలన అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్‌ది నిజాం పాలన అని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆరెస్‌లు రెండూ అవినీతి, కుటుంబ పార్టీలని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు ప్రజల చింత ఉండదని, తమ వారసుల కోసమే ఆలోచిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బీఆరెస్ కార్బన్ కాపీగా మారిందని విమర్శించారు. బీఆరెస్, కాంగ్రెస్ రోగాలకు చికిత్స బీజేపీ అని మోదీ అభివర్ణించారు. తెలంగాణ ప్రజలకు బీఆరెస్ నమ్మకం ద్రోహం చేసిందన్నారు. కేసీఆర్ తెలంగాణ తన జాగీర్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఫామ్‌హౌజ్ సీఎం అవసరమా
కారు పార్టీ ప్రభుత్వం స్టీరింగ్‌ను ఎంఐఎం ఒవైసీకి ఇచ్చి, కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్‌లో ఉంటారన్నారు. సెక్రటేరియట్‌కు రాకుండా ఫామ్‌హౌజ్‌లో ఉండే సీఎం అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను శాశ్వతంగా ఫామ్‌హౌజ్‌కు పంపించాలన్నారు.
ధరణితో కేసీఆర్ భూ మాఫియా
ధరణితో సీఎం కేసీఆర్ స్వయంగా భూమాఫియా నడుపుతున్నాడని, బీజేపీకి అవకాశమిస్తే ధరణి రద్దుచేసి ‘మీ భూమి’ పేరుతో కొత్త పోర్టల్ తీసుకొస్తామన్నారు.
సామాజిక న్యాయం బీజేపీతోనే
బీఆరెస్, కాంగ్రెస్ రెండూ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచాయని మోదీ ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌తో పాటు ఆయన విధానాలను అవమానించాయన్నారు. బీజేపీ మాత్రం అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చి గౌరవించుకుని, ఆయన విధానాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దళిత, గిరిజనులకు ఆ రెండు పార్టీలు మోసం చేశాయన్నారు. తొలిసారి ఆదివాసి మహిళ ముర్మును రాష్ట్రపతికి బీజేపీ చేస్తే, కాంగ్రెస్, బీఆరెస్‌లు అడ్డుకోవడానికి ప్రయత్నించాయన్నారు. దళితుడుని సీఎం చేస్తామని, డబుల్ బెడ్‌రూమలు కట్టిస్తామని సీఎం కేసీఆర్ చేయలేదన్నారు. దళితబంధు బీఆరెస్ ఎమ్మెల్యేల బంధుగా మార్చారన్నారు. తెలంగాణలో బీసీలకు తగిన న్యాయం దక్కలేదని, అందుకే బీజేపీ బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిందన్నారు. తెలంగాణలో మాదిగ సమాజం కోరుతున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు కమిటీని ఏర్పాటు చేశామని, వర్గీకరణ అమలుకు అన్ని చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.