విధాత : ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ స్వీప్ సాధించాలని, ఇందుకు కార్యకర్తలు, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు తో బైక్ ర్యాలీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇద్దరు అగ్రనేతలు ఒక్కటిగా ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్‌ను గెలిపించాలని చేసిన ప్రచారం కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తుమ్మల వంటి మంచి మనిషిని గెలిపించుకోవడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి పరుగులెడుతుందన్నారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాము కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. తుమ్మల మాట్లాడుతూ ఖమ్మంలో కాంగ్రెస్ విజయం జిల్లా ప్రజల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు పేదలకు, మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో అవినీతి, నియంతృత్వ బీఆరెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం ద్వారా ఇందిరమ్మ సంక్షేమ పాలనకు అవకాశం కల్పించాలన్నారు.