తెల్ల ఏనుగులా కాళేశ్వరం.. విచారణ చేపట్టడంలో కేంద్రం నిర్లక్ష్యం

  • కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శ
  • చ‌లో కాళేశ్వ‌రాన్ని అడ్డుకున్న పోలీసులు
  • మేడిగడ్డ సందర్శించిన పొన్నం, నేత‌లు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా మారింద‌ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుందా? అసలు వయబుల్ అవుతుందా? అనే అంశాల‌తోపాటు.. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయిన సంఘటనపైనా విచారణ జరిపించాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో కేంద్రం ఎందుకు మౌనం వ‌హిస్తున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు, కేసీఆర్‌కు ఏటీఎంలా ఉపయోగపడిందని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నా.. పిల్లర్ కుంగిన సంఘటనపై విచారణ చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రాజెక్టును సందర్శించినట్లు పొన్నం పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజక‌వర్గం నుంచి రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు బుధవారం నాలుగు బస్సుల్లో పొన్నం ఆధ్వర్యంలో మేడిగడ్డ సందర్శనకు వచ్చారు. వీరిని బొమ్మకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు పొన్నం ప్రభాకర్‌కు మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెల‌కొంది. అనంతరం పొన్నంతో పాటు అనుమతించిన కొందరు ప్రతినిధులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్శంగా పొన్నం మాట్లాడారు. ఈ ప్రాజెక్టును తానే రీడిజైన్ చేశాన‌ని కేసీఆర్ చెప్పుకొన్నార‌ని గుర్తు చేశారు.

మంచి జరిగితే ముఖ్యమంత్రికి, తప్పు జరిగితే అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతీ ప్రాజెక్టు ఉక్కులా నిలిచి ఉందన్నారు. ఇసుక‌, నిర్మాణ లోపం వ‌ల్లే స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని సాంకేతిక నిపుణులు చెబుతున్నార‌ని పొన్నం పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పనికొస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు.