విధాత: బీసీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు పురపాలక,పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి గంగుల కమలాకర్ చర్చలో పాల్గొన్నారు. ఈ సమయంలో బీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతిస్తుందని గంగుల కమలాకర్ అన్నారు. అదే సమయంలో బీసీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవగాహాన లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను గంగుల కమలాకర్ వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
బీసీలకు అనుమానం కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని సీఎం కోరారు. రాష్ట్రంలో తిరిగి మొత్తం వివరాలు సేకరించేందుకు బీసీ కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిందని ఆయన అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని.. బీసీ బిల్లుపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. వాళ్ల పార్టీ ఆదేశాలకు అనుగుణంగా గంగుల కమలాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీసీ బిల్లును తెస్తున్నందుకు గంగుల కమలాకర్ అభినందిస్తారని తనకు తెలుసునని ఆయన అన్నారు. కానీ, ఆయన వెనుకున్నవాళ్లు ఒత్తిడి తెస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్ల విషయం చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఐదుసార్లు లేఖలు రాసిన విషయాన్ని సీఎం తెలిపారు. కానీ, అపాయింట్ రాలేదన్నారు. జంతర్ మంతర్ లో దీక్ష చేస్తే వందమంది ఎంపీలు మద్దతు పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడలేదని ఆయన విమర్శించారు.