విధేయులకే పదవులు! తాజా నియామకాలే సంకేతం

ఎంపిక వెనుక భారీ కసరత్తు!


విధాత : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అందరికంటే ముందుగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందున్నారు. దాదాపు సిటింగ్‌లందరికీ సీట్లు ఇచ్చినా నాలుగైదు చోట్ల అభ్యర్థులను మార్చారు. 20-30 చోట్ల సిటింగ్‌లను మారిస్తే బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు గ్యారెంటీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో వ్యాఖ్యానించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే అయినా ఒకవేళ అలా మార్చి ఉంటే ఆ పార్టీలో ఏం జరిగేదో చెప్పనక్కరలేదంటున్నారు. నాలుగైదు చోట్ల మారిస్తేనే అధికార పార్టీలో అసంతృప్తులు పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యకు, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్లు నిరాకరించడంతో వాళ్లు కేసీఆర్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తూనే అక్కడ పోటీ చేసే అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. టికెట్లు రాని వారు బాధపడద్దని, వారికి ఇతర అవకాశాలు వస్తాయని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కొంతమంది ఆ హామీని అంగీకరించకపోయినా బహిరంగ విమర్శలు చేయలేదు. కానీ కొంతమంది నేరుగా కేసీఆర్‌ కుటుంబంపైనే విమర్శలు చేశారు. అందుకే పార్టీ పట్ల విధేయులుగా ఉన్న రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్‌ పదవి, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి కట్టబెట్టారన్న చర్చ జరుగుతున్నది.


మూడోసారి సొంతంగా అధికారంలోకి వస్తామన్న విశ్వాసం అధికార పార్టీలో మొదట్లో ఉన్నంత కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలతో కారు పార్టీలో కలవరం మొదలైందని, అందుకే ప్రతి ఓటు, ప్రతి సీటు ముఖ్యమనే భావనతోనే ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నదని చెబుతున్నారు. టికెట్ల ప్రకటన సమయంలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్‌కు వచ్చాక అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరిపారు. కానీ నేరుగా అధినేత నుంచి హామీ వస్తే తప్పా నేతల మధ్య విభేదాలు సద్దుమణిగే అవకాశం లేదని తేలింది.



అందుకే ముందుగా పార్టీపై విశ్వాసం ఉంచి, అధినేత మాట ఇస్తే తప్పరు అనే సంకేతాలు ఇవ్వడానికే రాజయ్య, ముత్తిరెడ్డిలకు పదవులు ఇచ్చారన్న చర్చ జరుగుతున్నది. కల్వకుర్తిలో టికెట్‌ ఆశించి, రాకున్నా పార్టీ గెలుపు కోసం పనిచేస్తాడని, స్థానికంగా పట్టున్న ఉప్పల వెంకటేశ్‌ గుప్తాకు మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వెళ్లిపోయిన మైనంపల్లి హన్మంతతరావు లాంటి వారిని ఓడించడమే ధ్యేయంగా నందికంటి శ్రీధర్‌కు ఎంబీసీ కార్పొరేషన్‌ పదవీ కట్టబెట్టారని తెలుస్తున్నది. ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్‌ పదవీ కాలం ముగిసి మూడేళ్లవుతున్నా ఇప్పటిదాకా దానిని ఖాళీగా ఉంచి.. ఇప్పుడు నందికంటికి అప్పగించారు.


తాజాగా కేసీఆర్ ప్రకటించిన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవుల వెనుక పెద్ద కసరత్తే జరిగిందని చెబుతున్నారు. టికెట్ల ఖరారులో అధినేతదే అంతిమ నిర్ణయం అయినా టికెట్లు రాని వారంతా మరో ముగ్గురు ముఖ్య నేతలు (కేటీఆర్‌, కవిత, హరీశ్‌)లతో పలుసార్లు భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. తాము ఏమి ఆశిస్తున్నామో అధినేతకు తెలియజేసేలా ఒక్కో నేత ఒక్కో కీలక నేత ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్టు సమాచారం. అయితే క్లిష్ట సమయంలో పార్టీకి అండగా ఉండి పనిచేయాలని వారంతా సదరు నేతలకు సూచించారని చెబుతున్నారు.



అందుకు వారు అంగీకరించిన తర్వాతే పదవుల ప్రకటన వెలువడినట్టు సమాచారం. ఎందుకంటే టికెట్లు దక్కని రోజే వీళ్లకు ఈ పదవులు దక్కబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇంతకాలం పట్టడం వెనుక పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చలే కారణమని చెబుతున్నారు. అధినేత పట్ల విధేయత ప్రకటించిన వాళ్లకు పదవులు, విమర్శించిన వారిని పట్టించుకోమన్నట్టే తాజా పరిణామాలను చూస్తే అర్థమౌతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.