కామారెడ్డిలో కేసీఆర్ కు నామినేషన్ల బెడద

  • Publish Date - November 2, 2023 / 02:41 PM IST

– ఫౌల్ట్రీ ఫామ్ రైతులు 100 నామినేషన్లు

విధాత ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు నామినేషన్ల బెడద తప్పేలా లేదు. ఇప్పటికే కాయితి లంబాడీల 1016 నామినేషన్లు వేస్తామని ప్రకటించగా, నిరుద్యోగులు సైతం నామినేషన్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫౌల్ట్రీ రైతులు సైతం తాము కూడా నామినేషన్లు వేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఫౌల్ట్రీ ఫార్మర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనాన్ని గురువారం నిర్వహించారు.


చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కార్యక్రమానికి తరలివచ్చి ఫౌల్ట్రీ రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓన్ ఫార్మర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రావు, ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కార్పొరేట్ ఫౌల్ట్రీ శక్తుల తీరుతో ఫౌల్ట్రీ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్పొరేట్ శక్తుల చేతిలో ధరల నిర్ణయంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఫౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.


రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే ఫౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలన్నారు. గ్రో ఇన్ చార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం అదే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మక్కలు ఫౌల్ట్రీ రంగానికి 28 శాతం సబ్సిడీకి ఇవ్వాలన్నారు. ఫౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించామన్నారు. రేపటి నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.

Latest News