హైదరాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని, ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంపై రేవంత్ స్పందించారు. ‘‘ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమావేశం మయసభలో దుర్యోధనుడి ఏకపాత్రాభినయం లాగా ఉంది.
వరి వేయమని కేంద్రానికి చెప్పి, వరి వేస్తే ఉరి అని కేసీఆర్ తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారు. కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఉరి పెట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇన్నిరోజులు మొద్దు నిద్ర నటించిన కేసీఆర్ ఇప్పుడు మోదీపైన, భాజపాపైన యుద్ధం అంటూ మరోసారి నటిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.