హైదరాబాద్: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకాను ఉచితంగా వేయాలనే ప్రధాన డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని గాంధీభవన్‌ల్‌లో ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా, బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులకు ఉచిత చికిత్స అందించాలనీ, ఈ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ చేపట్టిన ఈ దీక్షలు ఈ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగాయి. ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. గాంధీ భవన్‌లోని సత్యాగ్రహ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.