విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ‘మీ ముందుకు ఎన్నికలు వస్తున్నాయి. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సమరం ఇది. లక్ష కోట్లు దోపిడీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బై.. బై చెప్పే సమయం వచ్చింది’ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం కల్వకుర్తిలో జరిగిన విజయభేరి సభలో, జడ్చర్ల కార్నర్ మీటింలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయాని ప్రజలు కలగన్నారని, కానీ కేసీఆర్ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. డబ్బులు దండుకునే శాఖలు సీఎం కుటుంబం వద్దే ఉన్నాయని, ఈ శాఖల ద్వారా ప్రజలను పీడించి, డబ్బులు దండుకుని, దాచుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లు తిరిగి రాబట్టి, పేదల బ్యాంకు అకౌంట్‌లలో వేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగా ప్రాజెక్టు పిల్లర్లు కూలుతున్నాయని, ఇన్ని లక్షలు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని అన్నారు. ఈ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, నిజానిజాలు తేల్చాలన్నారు. కేసీఆర్ అవినీతితో తెలంగాణ ప్రజలు అప్పుల్లో కురుకుపోయారని, 2040 వరకు ఒక్కో వ్యక్తి పై లక్ష రూపాయల అప్పు ఉంటుందని చెప్పారు.
కాంగ్రెస్ నిర్మించిన నాగార్జున సాగర్, సింగూరు, జూరాల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. తమ హయాంలో దళితులకు, ఆదివాసీలకు భూములు ఇస్తే కేసీఆర్ వాటిని లాక్కున్నారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ పెట్టి భూముల వివరాలను కంప్యూటర్లకు ఎక్కించిన కేసీఆర్.. లక్షల మంది రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ధరణి ద్వారా కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభం పొందిందని, తెలంగాణ రైతులు నష్ట పోయారని రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజలు చెమట, రక్తం ధారబోసి తెలంగాణ తెచ్చుకుంటే.. ఇక్కడి సీఎం కేసీఆర్ వారిపై పునాదులు నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక రాజులా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఇక బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని రాహుల్ పిలుపునిచ్చారు.
పేదల సంక్షేమం మా ధ్యేయం
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు. వాటి అమలు బాధ్యత తనదేనని చెప్పారు. కేసీఆర్‌లా మాట తప్పబోమని, మాట ఇచ్చామంటే అమలు చేసేదాకా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దేశంలో విద్వేషాలు లేకుండా ప్రేమించే దయా గుణం రావాలని ఇటీవల జోడో యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా.. చెప్పానని గుర్తు చేశారు. కానీ దేశంలో నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ కలిసి ప్రజల్లో విద్వేషాలు నింపుతున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు పంచే ప్రదేశంలో తాను వారికి వ్యతిరేకంగా ప్రేమ దుకాణం తెరుస్తానని చెప్పారు. దేశంలో అధికశాతం ఓబీసీలు ఉన్నారని, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నారని రాహుల్ అన్నారు. ఇంత వరకు వీరి జనాభా ఎంత ఉందో మోదీ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఈ అంశాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించినా.. ఇంత వరకూ సమాధానం లేదన్నారు.
ఓబీసీలు ఎంతమంది ఉన్నారో మోదీ దగ్గర లెక్కలు ఉంటే చెప్పాలని సవాలు విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని రాహుల్ ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభను నడిపించేది ఎంపీలు కాదని, 90 మంది అధికారులేనని చెప్పారు. వీరు మోదీ మాట తప్ప మరెవరి మాటా వినరని అన్నారు. ఈ అధికారుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందినవారు ఉన్నారని తెలిపారు. ఇందులో కూడా ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని లెక్కలు సరిచేస్తామని రాహుల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపించే బీజేపీ.. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ నివాసాల్లో ఎందుకు తనిఖీలు చేయించడం లేదని ప్రశ్నించారు.
కారు చక్రాల గాలి తీయాలి
బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటేనని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మూడు పార్టీలూ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు బీజేపీ, ఎంఐఎం మద్దతు ఇస్తాయని, లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్, ఎంఐఎం.. బీజేపీకి మద్దతుగా ఉంటాయని విమర్శించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో బీజేపీకి మద్దతుగానే ఎంఐఎం పోటీ చేస్తుందని అన్నారు. మైనారిటీలు ఎక్కువగా లేని రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పోటీ చేయడం.. అక్కడ కాంగ్రెస్‌ను ఓడించేందుకేనని ఆరోపించారు. బీజేపీ నుంచి ఎంఐఎంకు డబ్బు అందుతున్నదని, ఆ డబ్బుతోనే వివిధ రాష్ట్రాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలుపుతుందని విమర్శించారు. మోదీ సర్కారు గాలిని కేంద్రంలో తాను తీస్తానని, రాష్ట్రంలో కారు నాలుగు చక్రాలకు గాలి మీరు తీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, భారీ సంఖ్య లో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.