త్వరలో షెడ్యూల్ ఖరారు
ఈనెల 26,27 తేదీలలో ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై పీసీసీ నేతల పర్యటన
నేడు సీఈసీ సమావేశం
మహబూబ్‌నగర్, నిజామాబాద్, అదిలాబాద్ కావాలంటున్నమైనార్టీలు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్
విధాత, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నవంబర్ మొదటి వారంలో రాష్ట్రానికి వస్తారని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ రెండవ విడత బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.
ఈ మేరకు త్వరలో షెడ్యూల్ విడుదల అవుతుందన్నారు. ఈ నెల 31వ తేదీన కొల్లాపూర్ లో సాయంత్రం 4 గంటలకు జరిగే పాలమూరు ప్రజా బేరి బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన తరువాత నేరుగా అక్కడి నుంచి కొల్లాపూర్‌కు వెళతారన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై ఈనెల26,27 తేదీలలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు థాక్రె , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పర్యటిస్తారన్నారు.
ఈ నేతలు రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు విస్తున్నాయని, అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. డిసెంబర్ 9 న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
నేడు సీఈసీ
అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు.ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశమవుతుందన్నారు. నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ ఎవరికి కేటాయించాలనేది స్క్రీనింగ్ కమిటీ చూసుకుంటుందన్నారు.
సీఈసి నిర్ణయం ఫైనల్ అని అన్నారు. రెండవ విడత లో బలమైన అభ్యర్థులందరికీ టికెట్లు వస్తాయన్నారు.ఆదిలాబాద్ ,నిజామాబాద్, మహబూబ్ నగర్ స్థానాలు మైనారిటీ లు అడుగుతున్నారన్నారు. మైనారిటీ లు కాంగ్రెస్ వైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు న్యాయం చేస్తుందని తెలిపారు.