జంట నగరాల్లో వర్షాలు.. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌

జంటనగరాల్లో గురువారం భారీ వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఎండల తీవ్రతతో ఇబ్బంది పడిన జంటనగర వాసులకు వర్షం ఊరటనిచ్చింది

  • Publish Date - May 16, 2024 / 05:30 PM IST

చల్లబడిన వాతావరణం.. మరో నాలుగు రోజులు వర్షాలు

విధాత : జంటనగరాల్లో గురువారం భారీ వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఎండల తీవ్రతతో ఇబ్బంది పడిన జంటనగర వాసులకు వర్షం ఊరటనిచ్చింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, ప్రకాష్ నగర్, చిలకల గూడ, అడ్డగుట్ట, హైటెక్ సిటీ, అమీర్‌పేట, మియాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, సచివాలయం, షాద్‌నగర్‌, మెహదీపట్నం, మాసబ్ ట్యాంకు సహా అంతటా భారీ వర్షం పడింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్దకు ఐపీఎల్ మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులు వర్షంలో ఇక్కట్లు పడ్డారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ నిర్వాహణ రాత్రి వరకు కూడా సందిగ్ధంలో పడింది. వర్షం నీరు రోడ్లపైకి రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కోన్నారు. మేయర్ విజయలక్ష్మి వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అరగంటలో అత్యధికంగా 5 సెంటిమీటర్ల వాన కురవడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

యూసఫ్ గూడలో లో 5.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 4.8, ఆదర్శ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్ ఫిరోజ్ గూడలో 4.2, బంజారాహిల్స్ 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా 4 సెంటి మీటర్ల లోపు వర్షం కురిసింది. మరోవైపు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

సంగారెడ్డి, మెదక్ జిల్లాలో నర్సాపూర్‌, పాపన్నపేట, వట్‌పల్లి, కోహిర్‌ మండలాల్లో సైతం భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో చెట్లు విరిగిపడ్డాయి. వరిపోలాల్లో, కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తెలంగాణలో రాగల నాలుగు పాటు తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది.

Latest News