గూండారాజ్ రావాలా? సంక్షేమ ప్రభుత్వం కావాలా? : ఎమ్మెల్యే కోరుకంటి

– కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి జాఫర్ జమానా

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: కాంగ్రెస్ గెలిస్తే గూండారాజ్ వస్తుంది.. బీఆర్ఎస్ ను గెలిపిస్తే సంక్షేమ ప్రభుత్వం వస్తుందని, ఏది కావాలో విజ్ఞతగా ఓటర్లు ఆలోచించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణి సంస్థ ఆర్జీ-1 పరిధి జీడీకే 11ఇంక్లైన్ గనిపై శనివారం జరిగిన గేటు మీటింగ్ లో కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. గోదావరిఖనిలో ‘గుండా’ జాఫర్ జమానాను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ యేఅని, ఆపార్టీని గెలిపిస్తే ఆ జమానా మళ్లీ పునరావృతమవుతుందని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు రౌడీయిజానికి, గూండాగిరికి వత్తాసు పలకరని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఈనగాచి నక్కల పాలైనట్లు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.


నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు, ఉద్యమకారులపై రాళ్లతో దాడి చేసిన వారు, నేడు సాధించుకున్న తెలంగాణలో అధికారం పొందడం కోసం తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, అవహేళన చేస్తూ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ముందుకొస్తున్నారని అన్నారు. అటువంటి మేక వన్నె పులుల పట్ల జాగృతం కావలసిన అవసరముందన్నారు. కేసీఆర్ తోనే సింగరేణి పరిరక్షణ సాధ్యమని, మరోమారు గెలిపించడానికి కార్మిక వర్గం ఒక్కతాటిపైకి వచ్చి ప్రతిన పూనాల్సిన సందర్భం వచ్చిందన్నారు. గని కార్మికులకు దూరాభారం తగ్గేలా ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా నుండి 11 ఇంక్లైన్ వరకు షార్ట్ కట్ రోడ్డు వేసేలా, 2ఏ లోయర్ బ్రిడ్జిని పునర్నిర్మించి కార్మికుల ఇబ్బందులు తొలగించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతులు పంపిద్దామన్నారు.


హైదరాబాద్ రాజకీయాన్ని ఇక్కడ రుద్దాలని వచ్చే టూరిస్టుల మోసపు మాటలు నమ్మి విలువైన ఓటును వృథా చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు నాయిని శంకర్, గండ్ర దామోదర్ రావు, మాదాసు రామ్మూర్తి, జాహిద్ పాషా, వడ్డేపల్లి శంకర్, కనకం శ్యామ్ సన్, మూల విజయా రెడ్డి, శశి, పుట్ట రమేష్, జోసెఫ్, కెనడి, సప్పిడి రామస్వామి, బాల రాజ్ కుమార్, గంగరాజు, పోలాడి శ్రీనివాసరావు, పీచర శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, నర్సింగరావు, తిరుపతి, కుల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.