Site icon vidhaatha

Khammam drowned । ఆ రెండే ఖమ్మం పట్టణాన్ని ముంచాయి!

Khammam drowned । పాలకుల నిర్ణక్ష్యం, ముందు చూపు లేని తనంతో ఖమ్మం ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం పట్టణంలో మెజార్టీ ప్రాంతం ముంపుకు గురైంది. అనేక కాలనీల ప్రజలకు కట్టు బట్టలు కూడా మిగల్లేదు. ఇంతటి విషాదానికి కారణం విపత్తు కంటే ఎక్కువగా గత పాలకుల అంతులేని నిర్ణక్ష్యంతో పాటు కబ్జాలే కారణమని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా ఖమ్మం ప్రజలకు వరద మంపునకు రెండు ప్రధాన కారణాలున్నాయని చెపుతున్నారు. ఆ కారణాలు ఏమిటంటే…

1) లకారం చెరువు చుట్టూ ఆనకట్ట

బల్లేపల్లి నుంచి న్యూ విజన్ స్కూల్ మీదుగా లకారం చెరువు అలుగు నుండి వరద నీరు దిగువకు వెళ్లాల్సి ఉంది. అయితే.. లకారం చెరువు చుట్టూ సుందరీకరణ పేరుతో (మినీ ట్యాంక్ బండ్) వాక్ వే నిర్మించారు. దీనితో ఎగువ నుంచి వచ్చే వరద నీరు లకారం చెరువులోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సహజసిద్ధంగా ఎగువ నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్లే మార్గాన్ని మూసి వేశారు. వర్షాలకు వచ్చిన వరద నీరు కిందకువెళ్లే మార్గం లేక పోవడంతో ఎటూ వెళ్లకుండా వెనుకకు పోటెత్తడంతో కవిరాజ్ నగర్ కాలనీలు, పాత కలెక్టర్ ఆఫీస్ వెనక ఉన్న ప్రాంతాలు, చెరువు బజార్, చైతన్య నగర్, మైసమ్మ గుడి ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. లకారం చెరువుకు చుట్టూ ఆనకట్ట వేయటం, ఎగువ నుంచి వచ్చే వరద నీరు కిందకు వెళ్లే కాలువ చిన్నగా ఉండటం వంటి కారణాలతో ప్రజలకు నేడు ఇబ్బందులు తెచ్చాయి. పైగా 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న చెరువు దాదాపు 40 ఎకరాలకు కుదించుకు పోయింది. ఈ 40 ఎకరాల చుట్టూ బండ్ నిర్మించారు. చెరువు కబ్జాకు గురి కావడంతో వరద నీరు నిల్వ ఉండే విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వరద అంతా చుట్టు పక్కల ఉన్న కాలనీలు, బస్తీలను ముంచెత్తింది. ఇంతే కాకుండా లకారం చెరువు వద్ద మూడు కోట్ల తో డ్రైనేజ్ నిర్మాణాలు ముందు చూపు లేకుండా నిర్మించడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది.

2) ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఎత్తుగా చెక్ డ్యామ్ నిర్మించడం

మున్నేరు వరదలో ఖమ్మం పట్టణం పుట్టి మునగడానికి ప్రధాన కారణం ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద ఎత్తుగా నిర్మించిన చెక్ డ్యామ్ ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. మున్నేరుపైన ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన చెక్ డ్యామ్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో వరద నీరు వెనక్కు పోటెత్తింది. దీంతో కోట నారాయణపురం, ప్రకాష్ నగర్, మోతే నగర్, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల ప్రాంతాలు, టీచర్స్ కాలనీ, జలగం నగర్, కాల్వ ఒడ్డు శ్మశాన వాటిక ప్రాంతాలు, సమ్మక్క సారక్క వెంకటేశ్వర నగర్ ప్రాంతాలకు వరద నీరు భారీ ఎత్తున చేరడంతో ఇళ్లన్నీ ముంపుకు గురయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చెక్ డ్యామ్ ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ప్రకాష్ నగర్ బ్రిడ్జికి రెండు వైపులా వరదనీరు పెద్ద ఎత్తున వెనక్కు వచ్చింది. చెక్ డాం ఎత్తు తగ్గించాలని ప్రజలు వేడుకున్నా కూడా గత పాలకులు పట్టించుకో లేదు. ఏం కాదన్న తీరుగా వ్యవహరించారు. ఫలితంగా నేడు ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆస్తి నష్టానికి గురికావాల్సి వచ్చింది. వరద బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పాలకుల తప్పిదానికి ఖమ్మం ప్రజలు తీవ్ర ఆవేదనకు గురికావాల్సి వచ్చింది.

Exit mobile version