విధాత, హైదరాబాద్ : రైతు బంధుపై కాంగ్రెస్, బీఆరెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. రైతు బంధు సహా వివిధ సంక్షేమ పథకాల కింద ఇచ్చే నిధులన్నింటినీ నవంబర్ 2వ తేదీలోగా ఇవ్వాలని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు కూడా వినతిపత్రం సమర్పించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బీఆరెస్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి.. రైతు బంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఒక్క అడుగు ముందుకేసి.. రైతు బంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వెంటనే రేవంత్ స్పందించి ‘నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు.. నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు పింఛన్ ఇవ్వు.. నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు’ అని సవాల్ చేస్తూ రీ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని తాము ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. డ్రామాలు ఆపి… నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని లేదంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
ఒక్కసారి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరువాత నగదు బదిలీ పథకాల అమలును ఎన్నికల కమిషన్ నిలిపి వేస్తుంది. నగదు బదిలీ పథకాల అమలును ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అమలు చేస్తే అధికార పార్టీ నేతలు దీనిని ఉపయోగించుకొని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈసీ ఈ చర్య తీసుకుంటుంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం దసరా సీజన్‌లో బతుకమ్మ చీరలను పంచుతుంది. అయితే ఈ ఏడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేసే సమయానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆ వెంటనే అధికారులు బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేశారు. అయితే ఇది ఓటర్లను ప్రభావితం చేసే పథకం కాకపోవడంతో దీనిని అధికార పార్టీ చర్చల్లోకి కూడా తీసుకురాలేదు. అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసే రైతు బంధు, సామాజిక పెన్షన్లు, దళిత బంధు, బీసీ బంధు తదితరాలు ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దీంతో పోలింగ్ సమయానికి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేసినట్లు భావించిన కాంగ్రెస్ పార్టీ దీనిని సీరియస్‌గా తీసుకున్నది. దీంతో మీకు రైతులు, వివిధ వర్గాలకు చెందిన పేద ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా నామినేషన్లు మొదలు కాకముందే వీటిని అమలు చేయాలని డిమాండ్ చేసింది. నామినేషన్లు వేసిన తరువాత ఈ పథకాలను అమలు చేయడమంటే కావాలని ఓ టర్లను ప్రభావితం చేయడానికే అని భావించింది. అయితే నవంబర్ 2లోపు అమలు చేయడం సాధ్యం కాదని భావించిన బీఆరెస్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్‌పై ఒంటి కాలిపై లేచారు. ఎన్నికల కోడ్ పేరుతో రైతు బంధును అడ్డుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. బాహాటంగా ఒక వైపు విమర్శలు చేసుకుంటూనే కేటీఆర్, రేవంత్‌లు ట్విట్టర్ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ రైతు విరోధి అని తేలిపోయింది
కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘అన్నదాత పాలిట నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతు బంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపు నిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెరలేపారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. జై కిసాన్..జై తెలంగాణ..!!, జై కేసీఆర్..జై బీఆరెస్..!!!” అని కేటీఆర్ పేర్కొన్నారు.
నిజంగా ప్రేముంటే 2లోపే ఇవ్వు : రేవంత్‌రెడ్డి
కేటీఆర్ ట్వీట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంతే స్థాయిలో ఘాటుగా స్పందించారు. “ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు? నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు.. నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు.. నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు.. నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే… నీలాంటి వాడిని చూసే… “నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది” అనే సామెత పుట్టింది. డ్రామాలు ఆపి… నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు… లేదంటే కాంగ్రెస్ వచ్చి…పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది.” అని పేర్కొన్నారు.
రైతుల జోలికొస్తే డిపాజిట్లు గల్లంతే : హరీశ్‌రావు
కాంగ్రెస్ పార్టీ రైతుబంధును ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని, రైతుల జోలికొస్తే డిపాజిట్లు గల్లంతు చేస్తాం ఖబడ్ధార్ అని మంత్రి టీ హరీశ్‌రావు హెచ్చరించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబందు పథకం కొత్త పథకం కాదని, 75వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా గతంలో అందించామన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే కేసీఆర్ రైతులకు డబ్బులు పంచడం జరిగిందన్నారు. 69 లక్షల రైతులు సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ వైఖరి గమినిస్తే చివరకు పింఛన్లు, కేసీఆర్ కిట్‌లను కూడా ఆపమంటారేమోనని ఎద్దేవా చేశారు. రైతుల పై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని, రైతుబంధు పొందిన 69లక్షల రైతులు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 11సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదని, మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11సార్లు రైతు బంధు ఇచ్చామన్నారు. మహా అంటే ఒక నెల రోజులు కాంగ్రెస్ కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేము రాగానే ఇస్తామని, ఇప్పటికే రైతు బంధు, రైతు రుణమాఫీ అమలు కొనసాగింపుకు వీలుగా ఎన్నికల సంఘానికి లేఖ రాశామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కుట్ర : మంత్రి జగదీశ్ రెడ్డి
సంక్షేమ పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు ఈసీకి పిర్యాదు చేయడం దుర్మార్గమైన చర్యని మంత్రి జీ జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజాసంక్షేమ పాలన అందించడంలో విఫలమైన ఆ పార్టీ తెలంగాణ సంక్షేమ పథకాలపై అక్కసు వెళ్లగక్కుతున్నదని విమర్శించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్‌తో అడ్డంపడి సంక్షోభం తెచ్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయని, రెండు పార్టీల అధ్యక్షులు ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నారని, అభ్యర్థుల ఎంపికలోనూ కలిసే నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
రైతన్నలు కుట్రలను గ్రహించాలి : నిరంజన్‌రెడ్డి
రైతుబంధుపై పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి కాంగ్రెస్ పార్టీ మరోసాని తన అక్కసు వెళ్లగక్కిందని వ్యవసాశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ట్వీట్టర్ వేదికగా ఆయన కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. కరోనా కన్నా డేంజర్‌గా కాంగ్రెస్ తయారైందని విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలను రైతులు గమనించి తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని, అధికారం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద గానీ, వ్యవసాయం మీద గానీ ప్రేమ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసం ఆన్ గోయింగ్ పథకాన్ని ఆపాలంటూ ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందన్నారు. అంత పెద్ద కరోనా విపత్తులోనూ సీఎం కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు ఆగనివ్వలేదన్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతున్నా తెలంగాణలో ఏడు వేల పైచిలుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నామని, కరువుతో అల్లాడి అంబలి కేంద్రాల కోసం ఎదురుచూశామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరంటు కోతలు, వలసలకు ఆనాడు తెలంగాణ నిలయమైందన్నారు. అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు నెలలు కాకముందే చేతులు ఎత్తేసిందన్నారు. ఇప్పుడు రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనమన్నారు.
కోడ్ పేరుతో పొట్ట కొడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్సీ కవిత
నాలుగు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ పేరుతో ప్రజల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కోడ్ ముసుగులో ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతుబంధును అడ్డుకుని కాంగ్రెస్ రైతులపై తన కడుపుమంటను చాటుకుందన్నారు.